నారా కుర్రాడు సినిమాలు వదిలేశాడా?

నారా కుర్రాడు సినిమాలు వదిలేశాడా?

తొలి సినిమా ‘బాణం’తోనే తన దారి వేరని చాటిచెప్పాడు నారా రోహిత్. ఆ తర్వాత ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’, ‘అసుర’, జ్యో అచ్యుతానంద’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో మంచి పేరే సంపాదించాడు. ఒక దశలో దాదాపు పది సినిమాలు లైన్లో పెట్టి ఔరా అనిపించాడతను. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలైతే చేసుకుంటూ సాగిపోయాడు. అందులో చాలా వరకు ఆసక్తి రేకెత్తించినవి. కొత్తగా అనిపించినవే. కానీ ఈ సినిమాల రిలీజ్ తర్వాత కథ మారిపోయింది.

వరుస ఫ్లాపులు ఎలాంటి హీరోనైనా వెనక్కి లాగేస్తాయి. నారా రోహిత్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. గత రెండేళ్లలో ఐదారు ఫ్లాపుల పడ్డాయి రోహిత్ ఖాతాలో. దీంతో అంతంతమాత్రంగా ఉన్న అతడి మార్కెట్ దెబ్బ తినేసింది. చివరగా ‘వీర భోగ వసంత రాయలు’ మూవీతో పలకరించాడు రోహిత్. ఆ సినిమా ఫలితమేంటో చెప్పాల్సిన పని లేదు.

హీరోగా అరంగేట్రం చేసిన నాటి నుంచి ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ పోయిన రోహిత్.. ఎన్నడూ లేని విధంగా ఖాళీగా ఉండిపోయాడు. దాదాపు పది నెలల నుంచి అతను సినిమాలేమీ చేస్తున్నట్లు లేడు. ‘బాణం’ దర్శకుడితో ‘అనగనగా దక్షిణాదిలో’ అనే సినిమా అనౌన్స్ చేశారు కానీ.. అది అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ‘శబ్దం’ అనే మరో సినిమా సంగతి కూడా అతీ గతీ లేదు. ఎన్నికల సమయంలో కూడా ఎక్కడా పెద్దగా కనిపించని రోహిత్.. సినిమా వేడుకలకూ దూరంగా ఉంటూ వచ్చాడు.

ఎట్టకేలకు తన మిత్రుడు శ్రీవిష్ణు నటించిన ‘బ్రోచేవారెవరురా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథుల్లో ఒకడిగా వచ్చాడు రోహిత్. ఇక్కడ అతడి లుక్ చూసే అందరూ షాకయ్యారు. ఆ మధ్యలో బరువు తగ్గే ప్రయత్నం చేసిన రోహిత్.. మళ్లీ ఫిజిక్‌ను పట్టించుకోవడం మానేసినట్లున్నాడు. ఏమాత్రం హీరో లుక్ కనిపించలేదు. గడ్డం కూడా బాగా పెంచి చాలా సాధారణమైన లుక్‌లోకి వచ్చేశాడు రోహిత్. పరిస్థితి చూస్తుంటే రోహిత్‌కు సినిమాల మీద ఆసక్తి పోయిందేమో.. ఇక ఇండస్ట్రీలో కొనసాగడేమో అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English