జ‌గ‌న్ ఇక పోరాడాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇక కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో పోరాడ‌క త‌ప్ప‌దా? ఏపీ ప్ర‌త్యేక హోదాపై త‌న గ‌ళాన్ని పెంచ‌క త‌ప్ప‌దా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించిన స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చ‌ట్ట‌స‌భ‌ల సాక్షిగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చి ప్ర‌ధాని అయిన మోడీ దాన్ని ప‌క్క‌న‌పెట్టింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తేనెతుట్టెను క‌దిలించిన‌ట్లే క‌నిపిస్తోంది. దేశంలో అత్యంత వెన‌క‌బ‌డిన ప్రాంత‌మైన బీహార్‌కు ప్ర‌త్యే హోదా ఇవ్వాల‌ని నీతి అయోగ్ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

పార్ల‌మెంట్లో ఇచ్చిన హామీనే ఇప్ప‌టికీ కేంద్రం తీర్చ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీకి హోదా ఇవ్వ‌లేమ‌న్న బీజేపీ ఇప్పుడు బీహార్‌కు ఎలా ఇస్తుంద‌న్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. బీహార్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తారో? లేదో? అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే ఇప్పుడు రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు ఏపీ అధికార పార్టీకి ఇబ్బందిక‌రంగా మార‌నున్నాయి. గ‌తంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని మోడీ ప్ర‌భుత్వం చెప్ప‌గా అందుకు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు అంగీక‌రించారు.

దీన్ని వ్య‌తిరేకించిన అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ త‌మ ఎంపీల‌తో రాజీనామాలు చేయించింది. కానీ ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. బీజేపీకి ఉభ‌య స‌భ‌ల్లో బ‌లం ఉన్నందున ప్ర‌త్యేక హోదాపై ఒత్తిడి తేలేమ‌ని వైసీపీ చెబుతోంది. కానీ ఇప్పుడు బీహార్‌కు ప్ర‌త్యేక హోదా ఇచ్చే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని చెప్పిన త‌ర్వాత ఆయ‌న ఇక తాడోపేడో తేల్చుకోక త‌ప్ప‌దు. లేదంటే రాజ‌కీయంగా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది.

ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్  ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌మ పార్టీల ఎంపీల‌ను రాజీనామా చేయిస్తాన‌ని వైసీపీ ఎంపీలు అందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ స‌వాల్ కూడా విసిరారు. మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన మోడీ.. అక్క‌డ బీజేపీ బ‌లోపేతంపై ఆ పార్టీ రాష్ట్ర ఎంపీల‌కు సూచ‌న‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పోరాటం చేయ‌క‌పోతే మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.