‘పుష్ప’ సినిమాటోగ్రాఫర్‌‌తో సుకుమార్ ఫైట్

సుకుమార్ సినిమాల్లో చాలా వాటికి ఛాయాగ్రహణం అందించింది రత్నవేలు. వాళ్లిద్దరికీ ఎంత బాగా సింక్ అవుతుందో తెలిసిందే. తన ప్రతి సినిమాకూ దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీతం చేయించుకునే సుకుమార్.. చాలా వరకు ఛాయాగ్రహణ బాధ్యతలు రత్నవేలుకే అప్పగిస్తుంటాడు.

ఐతే ‘పుష్ప’ మొదలయ్యే సమయానికి ‘ఇండియన్’ సినిమాకు కమిటై ఉండటంతో రత్నవేలు ఈ చిత్రానికి పని చేయలేకపోయాడు. దీంతో అప్పటికే ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన పోలెండ్ సినిమాటోగ్రాఫర్ మిరస్లోవ్ కూబాను ఈ సినిమాకు తీసుకున్నాడు సుక్కు.

ఐతే ఈ సినిమా షూటింగ్ తొలి రోజుల్లో కూబాతో సుకుమార్‌కు పెద్ద గొడవే అయిందట. ‘పుష్ప’ రిలీజ్ ప్రెస్ మీట్లో స్వయంగా సుకుమారే ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ కథేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నాకు ఇంగ్లిష్ సరిగా రాదు. కూబా పోలిష్ తప్ప వేరే భాష సరిగా మాట్లాడలేడు. అతడికి కూడా ఇంగ్లిష్ అంతగా రాదు. కానీ సినిమా ఎంత గొప్పదంటే.. ‘పుష్ప’ షూటింగ్ సందర్భంగా నేనేం చెబుతున్నానో తనకు అర్థమైపోయేది. తనేం మాట్లాడుతున్నాడో నేను అర్థం చేసుకోగలిగేవాడిని.

అంతలా మా ఇద్దరికీ సింక్ అయింది. కానీ ఇలా కావడానికి ముందు షూటింగ్ తొలి రోజుల్లో మా ఇద్దరికీ పెద్ద గొడవైంది. నేను ఒకసారి షూటింగ్‌లో ‘చేంజ్ ద లెన్స్’ అని చెప్పాను. దానికతను ‘సెన్స్ లెస్’ అన్నాడు. ఇంకోసారి ‘ఛేంజ్ ద లెన్స్’ అన్నా కూడా అతను ‘సెన్స్ లెస్’ అనే అన్నాడు. నేను హర్టయ్యాను.

ఒక దర్శకుడు లెన్స్ మార్చమంటే సెన్స్ లెస్ అనడమేంటి అనిపించింది. దీంతో కోపం వచ్చి అతడిని పిలిచి గట్టిగా అరిచాను. నేనంటే ఏమనుకుంటున్నావు.. నేనెలాంటి సినిమాలు తీశానో తెలుసా? నా సినిమాలసలు చూశావా అంటూ తిట్టేశాను. దానికతను కళ్లల్లో నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయాడు.

తర్వాత నేను పడుకుంటే డోర్ కొట్టి లోపలికి వచ్చి తాను అన్నట్లుగా ‘సెన్స్ లెస్’ అనే మాట ఎప్పుడూ అనలేదని చెప్పాడు. చేంజ్ లెన్స్ అనే మాటనే పోలిష్ యాసలో పలకడంతో అది ‘సెన్స్ లెస్’ అని అనిపించిందని నాకర్థమైంది. ఇక ఆ తర్వాత మా ఇద్దరికీ ఎలాంటి సమస్య రాలేదు. అప్పట్నుంచి ‘చేంజ్ ద లెన్స్’ అని కాకుండా ‘లెన్స్ చేంజ్’ అని అనుకోవడం మొదలుపెట్టాం’’ అంటూ సుకుమార్ నవ్వేశాడు.