సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేయండి

“సీఎం జ‌గ‌న్ చెప్పింది చాలా క‌రెక్ట్‌. ఆయ‌న చాలా దూర‌దృష్టితో కొన్ని సూచ‌న‌లు చేశారు. ప్ర‌భుత్వం కూడా స‌హ‌క‌రించేందుకు రెడీగా ఉంది. ఇలా చేయ‌మనండి. కేంద్రాన్ని ఆలోచించ‌మ‌నండి. సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌ను .. మీరు కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి. త‌ప్ప‌కుండా.. ఏపీకి న్యాయం జ‌రుగుతుంది” ఇలా రాసింది .. హైకోర్టు ధ‌ర్మాస‌నాన్ని కోరింది ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల‌ను విచారించిన సీబీఐ.. మాజీ జేడీ.. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఎంపీగా జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన ల‌క్ష్మీనార‌ణే!

విశాఖ ఉక్కుక‌ర్మాగారాన్ని ప్రైవేటీక‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టుద‌లగా ఉన్న విష‌యం తెలిసిందే. అయ‌తే.. దీనిపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు.. నాయ‌కులు పోరాటం చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఒక‌రోజు దీక్ష చేశారు. అయితే.. ఎవ‌రూ న్యాయ‌పోరాటం దిశ‌గా అడుగులు వేయ‌లేదు. కానీ.. జేడీ మాత్రం దీనిని రాష్ట్ర హైకోర్టు వ‌ర‌కు తీసుకువెళ్లారు. ఇప్ప‌టికే ఆయ‌న దీనిపై పిటిష‌న్ వేయ‌డం.. రెండు సార్లు విచార‌ణ కూడా జ‌ర‌గ‌డం తెలిసిందే. తాజాగా ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జేడీ హైకోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి రాసిన లేఖ‌లోని అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మా పిటీషన్ పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే.. గ‌తంలో ఆదేశించిన‌ట్టు స్టీల్ ప్లాంట్ నుంచి ఎటువంటి అఫిడవిట్ దాఖలు కాలేదు. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ నే తమ అఫిడవిట్ గా తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్పింది. దీంతో ఫిబ్రవరి రెండుకు విచారణ వాయిదా పడింది. అయితే.. జేడీ ల‌క్ష్మీనార‌య‌ణ త‌ర‌ఫున న్యాయ‌వాది అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. దీనిలో ఏమ‌ని పేర్కొన్నారంటే..

ప్రభుత్వ పాలసీ నిర్ణయాల వల్ల రాజ్యాంగ హక్కుల భంగం కలిగితే కోర్ట్ జోక్యం చేసుకోవచ్చు. నాడు భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు న్యాయం జరగలేదు. ప్రైవేటీకరణ తో భూములు ఇచ్చిన హక్కులకు భంగం కలుగుతుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ప్రత్యామ్నాయాలు సూచించారు. సీఎం జ‌గ‌న్ చెప్పిన విష‌యాల‌ను.. ఆయ‌న సూచించిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ అవసరం లేదు.. అని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.