దర్శకుడు బాగు పడ్డాడు.. పాపం హీరో హీరోయిన్లు

దర్శకుడు బాగు పడ్డాడు.. పాపం హీరో హీరోయిన్లు

గత ఏడాది చాలా మంచి అప్లాజ్ తెచ్చుకున్న చిన్న చిత్రాల్లో ‘చి ల సౌ’ ఒకటి. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన చిత్రమిది. అతను దర్శకత్వం చేయడమేంటి అంటూ ముందు అందరూ ఆశ్చర్యపోయారు కానీ.. సినిమా చూశాక కానీ అతడి టాలెంట్ ఏంటో అర్థం కాలేదు. తక్కువ బడ్జెట్లో, పరిమిత వనరులతో మంచి సినిమాను అందించాడు రాహుల్.

ఈ సినిమాతో హీరో హీరోయిన్లు సుశాంత్, రుహాని శర్మలకు కూడా మంచి పేరొచ్చింది. కెరీర్లో తొలిసారి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు సుశాంత్. ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకు.. సింపుల్ యాక్టింగ్‌తో మెప్పించినందుకు అతడికి ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ రుహానికి కూడా బాగానే పేరొచ్చింది. కానీ ఏం లాభం? ఈ ఇద్దరి కెరీర్లు ఏమంత ఊపందుకోలేదు.

‘చి ల సౌ’తో కమర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా.. రాహుల్ టాలెంట్ గుర్తించి అక్కినేని నాగార్జున ‘మన్మథుడు-2’ చేసే అవకాశమిచ్చాడు. రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం అందుకోవడం చిన్న విషయం కాదు. ఇటీవలే విడుదలైన ‘మన్మథుడు-2’ టీజర్ చూస్తే సినిమా హిట్టయ్యేలాగే కనిపిస్తోంది. ఇక యాక్టింగ్ వదిలేసి రాహుల్ దర్శకుడిగా ఫిక్సయిపోయేలాగే ఉన్నాడు. కానీ సుశాంత్ ‘చి ల సౌ’ తర్వాత హీరోగా సినిమానే మొదలుపెట్టలేదు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమలో క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు కానీ.. దానికి ఏమాత్రం ప్రాధాన్యం ఉందన్నది సందేహమే.

హీరోయిన్ రుహానికైతే తెలుగులో మరో సినిమా రానే లేదు. రెగ్యులర్ హీరోయిన్లలా గ్లామర్ రోల్ చేసి ఉంటే ఛాన్సులు వచ్చేవేమో. పూర్తిగా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయడంతో ప్రశంసలే మిగిలాయి తప్ప అవకాశాల్లేవు. తనలోని గ్లామర్ కోణాన్ని చూపిస్తూ ఎన్ని ఫొటో షూట్లు చేసినా కూడా తెలుగులో ఆమెకు ఒక్కటంటే ఒక్క సినిమా రాలేదు పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English