మంచు విష్ణు సినిమాకు ఇంతటి దుస్థితా?

మంచు విష్ణు సినిమాకు ఇంతటి దుస్థితా?

మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతటి ఆధిపత్యం చలాయించారో తెలిసిందే. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఆయన పతాక స్థాయిని అందుకున్నారు. ‘పెదరాయుడు’ సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఘనుడాయన. కానీ మోహన్ బాబు కొడుకులు, కూతురు ఆయన లెగసీని కొనసాగించడంలో ఘోరంగా విఫలమయ్యారు. వీళ్లను పెట్టి సొంత నిర్మాణ సంస్థలో రెండంకెల సంఖ్యలో సినిమాలు తీశారు మోహన్ బాబు. తక్కువలో తక్కువ వంద కోట్లయినా వీళ్ల మీద ఖర్చు పెట్టి ఉంటారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. పోరాడి పోరాడి మధ్యలో మంచు విష్ణు, మంచు మనోజ్ కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించారు. కానీ మళ్లీ గాడి తప్పారు. వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయే పరిస్థితికి వచ్చారు. చివరగా వీళ్ల నుంచి వచ్చిన సినిమాలతో ఇద్దరి మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయింది.

ఇప్పుడు మంచు విష్ణు సినిమా ఒకటి రిలీజ్ చేద్దామంటే కొనే నాథుడు లేడు. థియేటర్లు ఇవ్వడానికి వాటి యాజమాన్యాలు ఆసక్తి చూపించడం లేదు. విష్ణు హీరోగా ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి రూపొందించిన ‘ఓటర్’ సినిమాను ఈ శుక్రవారమే రిలీజ్ చేద్దామని నిర్మాత జాన్ సుధీర్ పూదోట ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఈ సినిమా విషయంలో ఓ వివాదం కారణంగా విష్ణు, కార్తీక్ ప్రమోషన్లకు దూరం అయిపోయారు. విష్ణు అయితే అసలు ఇది తన సినిమానే కాదన్నట్లుగా ఉండిపోయాడు. నిర్మాత ఏదో ఒకటి చేసి సినిమాను రిలీజ్ చేద్దామని చూస్తున్నాడు. డేట్ ఇచ్చేసి సన్నాహాలు మొదలుపెట్టాడు. కానీ సినిమాను కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. సొంతంగా అయినా రిలీజ్ చేద్దామనుకుంటుంటే థియేటర్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ శుక్రవారం ‘ఓటర్’తో పాటుగా ఇంకో ఐదు సినిమాల దాకా రిలీజవుతున్నాయి. వాటిలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మల్లేశం’ లాంటి సినిమాలపైనే ఎగ్జిబిటర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంకో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్‌ సిటీలో ‘ఓటర్’కు ఒక్కటంటే ఒక్క సినిమా కేటాయించలేదు. పరిస్థితి చూస్తుంటే ఈ వారం ఈ సినిమా రిలీజ్ కావడమే సందేహంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English