142 రోజులు.. ఫామ్ హౌస్‌లోనే కేసీఆర్‌

ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా పాల‌న బాధ్య‌త‌లు చేసే వ్య‌క్తి సాధార‌ణంగా అయితే స‌చివాలంయంలో లేదా అధికారిక నివాసంలో ఉంటారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి చ‌ర్చిస్తూ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ రూటే స‌ప‌రేట్ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న ఏడాదిలో మూడు వంతుల రోజుల కంటే ఎక్కువ‌గా ఫామ్‌హౌస్‌లోనే ఉండ‌డం అందుకు కార‌ణం. గ‌తేడాది డిసెంబ‌ర్ 13 నుంచి ఈ ఏడాది డిసెంబ‌ర్ 12 వ‌ర‌కూ ఆయ‌న ఏకంగా 142 రోజుల పాటు సిద్ధిపేట జిల్లా ఎర్ర‌వ‌ల్లిలోని వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే గ‌డిపారు. ప్ర‌తి నెల‌లో కొన్ని రోజుల పాటు అక్క‌డ ఉన్నారు.

విమ‌ర్శ‌లు వ‌చ్చినా..
స‌చివాల‌యానికి రాని సీఎం కేసీఆర్ ఒక్క‌రే అంటూ ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాయి. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కే ప‌రిమిత‌మైన ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏం తెలుసుకుంటార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఫామ్‌హౌస్‌లోనే ప‌డుకునే వ్య‌క్తి ఇక పాల‌న ఎలా చేస్తారంటూ విప‌క్షాలు ఆయ‌న‌పై మాట‌ల దాడి కొన‌సాగిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ప‌ట్టించుకోని కేసీఆర్‌.. త‌న పంథాను మార్చుకోవ‌డం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని సార్లు అయితే ఏకంగా నెల‌లో 18 రోజుల పాటు ఆయ‌న ఫామ్‌హౌస్‌లో గ‌డిపిన ప‌రిస్థితి ఉంది. గ‌తేడాది జూన్‌లో 18 రోజులు, జ‌న‌వ‌రిలో 17 రోజులు ఇలా ఫామ్‌హౌస్‌కే ఆయ‌న ప‌రిమిత‌మ‌య్యారు. ఆయ‌న అక్క‌డ ఉండ‌గానే క‌రోనా బారిన ప‌డ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు సీఎస్ ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో వ‌రుస‌గా 21 రోజుల పాటు ఆయ‌న అక్క‌డే గ‌డిపారు.

అన్నింటికీ అదే వేదిక‌..
ఫామ్‌హౌస్లోనే ఉంటూ కేసీఆర్ అన్ని ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని స‌మాచారం. కేసీఆర్‌ను క‌ల‌వాల‌నుకునే వాళ్లు సార్ ఎక్క‌డ ఉన్నారు.. హైద‌రాబాద్‌లోనా లేదా ఫామ్‌హౌస్‌లోనా అని ముందే తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలా విన‌డానికి విడ్డూరంగా ఉన్నా అదే నిజం. ఏడాదిలో కొన్ని ముఖ్య‌మైన రోజులు, కొన్ని పండ‌గ‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న ఫామ్‌హౌస్‌ను విడిచి రాలేదు. కొన్ని సార్లు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లను కూడా అక్క‌డి నుంచే పూర్తి చేశారు.

అక్క‌డి నుంచే ఫోన్ ద్వారానే రాష్ట్ర పాల‌నా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్యవేక్షించారు. మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో నేరుగా మాట్లాడాల‌ని అనుకుంటే వాళ్ల‌నే అక్క‌డికి పిలిపించుకునేవారు. ఒక ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను టీఆర్ఎస్‌లోకి చేర్చుకునే క‌స‌ర‌త్తుల‌కు ఫామ్‌హౌస్ వేదిక‌గా మారింద‌ని టాక్‌. ఇలా ఆయ‌న ప్ర‌తి నెలా ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లే స‌మ‌యంలో పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్ష‌లు.. ఇలా ఎన్నో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం త‌న వైఖ‌రి మార్చుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.