అసలేం జరిగింది.. కిక్కిస్తున్న కల్లు పాట

అసలేం జరిగింది.. కిక్కిస్తున్న కల్లు పాట

విశాల్ కంటే ముందు తమిళంలో మంచి పేరు సంపాదించిన తెలుగు నటుడు శ్రీకాంత్. తెలుగులో శ్రీరామ్ పేరుతో నటించిన అతను.. డబ్బింగ్ మూవీ ‘రోజాపూలు’తో పాటు ‘ఒకరికి ఒకరు’.. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’.. ‘లై’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడతను తెలుగులో మళ్లీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’.

కెమెరామన్ ఎన్వీఆర్ దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రమిది. శ్రీరామ్ సరసన కన్నడ భామ సంచిత పదుకొనే కథానాయికగా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థ్రిల్లర్ మూవీ నుంచి తాజాగా ఒక పాట లాంచ్ చేశారు. ‘‘మమ్మారే కల్లు మత్తెక్కింది.. మమ్మారే మతి పోతుంది..’’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్.. తెలంగాణ జానపదాల్ని గుర్తుకు తెచ్చేలా.. ఆకట్టుకునేలా సాగింది.

తెలంగాణ పల్లెల్లో కల్లుకు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని మద్యం లాగా కాకుండా ఒక పానీయం లాగా చూస్తారు. ఈ నేపథ్యాన్ని.. కల్లు మాధుర్యాన్ని ఎలివేట్ చేసేలా ఈ పాట సాగింది. చిరవూరి విజయ్ కుమార్ రాసిన ఈ పాటను రాంకీ మంచి ఊపుతో ఆలపించాడు. సంగీత దర్శకుడు యేలేందర్ మహవీర్ బీట్ ఉండేలా ఈ పాటను ట్యూన్ చేశాడు.

మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఉందీ పాట. ఎక్సోడస్ మీడియా పతాకం మీద కింగ్ జాన్సన్, నీలిమ ఈ చిత్రాన్ని నిర్మించారు. పూర్తిగా తెలంగాణ గ్రామాల్లోనే ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘అసలేం జరిగింది’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English