‘షాక్’ ఇస్తే తప్ప చూడరు బాబూ

  ‘షాక్’ ఇస్తే తప్ప చూడరు బాబూ

ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకే జనాలు థియేటర్లకు కదలడం కష్టం అయిపోతోంది. ఇక చిన్న హీరోల సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. థియేటర్లకు వెళ్లి చూడాలంటే అందులో ఏదో షాకింగ్ ఫ్యాక్టర్ ఉండాల్సిందే. ముఖ్యంగా టీజర్, ట్రైలర్లలో అలాంటి ‘షాక్’లు కనిపిస్తే తప్ప జనాలు సినిమాల్ని పట్టించుకోవడం లేదు.

కార్తికేయ అనే అనామక హీరో నటించిన ‘ఆర్ఎక్స్ 100’ పట్ల జనాలు ఆసక్తి చూపించారంటే దాని ప్రోమోలన్నీ స్టన్నింగ్‌గా ఉండటమే కారణం. అలాగని ఇదే స్టయిల్లో తీర్చిదిద్దిన వేరే సినిమాలు కూడా జనాల్ని అంతగా ఆకర్షించలేకపోయాయి. ఒకసారి చేసింది ఇంకోసారి చేస్తే జనాలకు మొహం మొత్తేస్తుంది. కాబట్టి కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. ‘ఆర్ఎక్స్ 100’ అడల్ట్ కంటెంట్ వల్లే హిట్టయిందేమో అన్న భ్రమలో కార్తికేయ తర్వాతి సినిమా ‘హిప్పి’లో బోల్డ్ కంటెంట్ మీదే దృష్టిపెట్టారు. అది చీదేసింది.

ఇప్పుడు కార్తికేయ హీరోగా ‘గుణ 369’ అనే సినిమా రాబోతోంది. ఈ టైటిల్ చూసి ఇదేదో వైవిధ్యమైన సిినమా అనుకున్నారు. కమల్ హాసన్ నటించిన ‘గుణ’ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. తీరా దీని టీజర్ చూస్తే ఏ ప్రత్యేకతా కనిపించలేదు. రెగ్యులర్ మాస్ సినిమా లాగే అనిపించింది. కార్తికేయ పాత్రలో ఏ కొత్తదనం కనిపించలేదు. ఒక అమ్మాయితో హీరో ప్రేమ.. తనకు అన్యాయం చేసిన పెద్దోళ్లపై తిరుగుబాటు.. ఇలా రొటీన్‌గా సాగిపోయే సినిమాలా కనిపించింది టీజర్ చూస్తే.

ఈ రేంజ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే కచ్చితంగా టీజర్, ట్రైలర్లలోనే ప్రేక్షకులకు ఏదో ఒక ‘షాక్’ ఇవ్వాలి. ఏదో కొత్త పాయింట్ చూపిస్తే తప్ప.. జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేటవ్వదు. అలాంటి ఆసక్తి ఏమీ ‘గుణ 369’ టీజర్లో కనిపించలేదు. మరి ట్రైలర్లో అయినా ఇలాంటి కంటెంట్ ఏమైనా పెడతారేమో చూడాలి. లేదంటే మాత్రం కార్తికేయ మరో ఫ్లాప్‌కు రెడీ అయిపోవాల్సిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English