వామ్మో.. ఆయనగారు హీరో అట

 వామ్మో.. ఆయనగారు హీరో అట

హరినాథ్ పొలిచెర్ల అని ఒక ఎన్నారై. ఆయనకు నటన అంటే మహా మోజు. ‘వెన్నెల’ లాంటి ఒకట్రెండు సినిమాల్లో ఏవో పాత్రలు చేసి ముచ్చట తీర్చుకున్నాడు. అంతటితో ఆగితే పోయేది. కానీ తనే హీరోగా ‘చంద్రహాస్’ అనే సినిమా తీశాడు. దాని మీద కోట్లు పోశాడు. ఆ సినిమా యూట్యూబ్‌లోనే ఉంటుంది. దాన్నొక షో వేసుకుని చూస్తే అయ్యగారి విన్యాసాలకు కళ్లు బైర్లు కమ్ముతాయి.

దండిగా డబ్బులున్న ఇలాంటి ‘బాబులు’ హీరో వేషాలేసి డబ్బులు తగలేయడం మామూలే. యూట్యూబ్‌లో చూసి నవ్వుకోవడానికి ఇవి బాగానే ఉంటాయి. మన దగ్గరే కాదు.. తమిళంలో కూడా ఇలాంటోళ్లు కొంతమంది ఉన్నారు. పవర్ స్టార్ శ్రీనివాసన్ అనే ఒకాయన ఇలాగే బిల్డప్పులతో చంపేస్తుంటాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో సూపర్ హీరో వచ్చాడు. ఆయనే ‘లెజెండ్ శరవణన్’.

చెన్నైలో బాగా ఫేమస్ అయిన శరవణా స్టోర్స్ అధినేతే ఈ లెజెండ్ శరవణన్. ఆ షాపింగ్ మాల్ ప్రకటనల్లో మగ మోడల్స్ ఎవ్వరూ కనిపించరు. ఈయనే ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్. ఈయన తమన్నా లాంటి ఫేమస్ హీరోయిన్లతో కలిసి యాడ్స్ చేస్తుంటాడు. ఇలాంటి జోడీల్ని ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. కానీ తమిళ జనాలు ఎలాగో భరిస్తున్నారు. ఐతే కేవలం ప్రకటనలతో సరిపెట్టుకుండా ఈయన గారు హీరోగా సినిమా చేసేయబోతున్నారట.

శరవణన్ హీరోగా పరిచయం కాబోయే సినిమాకు ఒకరు కాదు.. ఇద్దరు దర్శకులట. వారి పేర్లు జేడీ, జెర్రీ. ఈయనగారిని హీరోగా పెట్టి సినిమా తీసే నిర్మాత ఎవరు అంటారా? ఎవరో ఎందుకు చేస్తారు. ఆ పని శరవణనే చేసుకుంటున్నాడు. విశేషం ఏంటంటే మొదలు కాకముందే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న శరవణన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English