ఆ సినిమా ఈ ఏడాది లేనట్లే

ఆ సినిమా ఈ ఏడాది లేనట్లే

టాలీవుడ్లో ఈ మధ్య వరుసగా హీరోలు గాయాల పాలవుతుండటం.. వాళ్లు నటిస్తున్న సినిమాల షెడ్యూళ్లు తేడా కొడుతుండటం తెలిసిన సంగతే. గత రెండు మూడు నెలల్లో అరడజను మంది దాకా హీరోలు గాయాల పాలయ్యారు. అందరిలోకి తీవ్ర గాయం హీరో శర్వానంద్‌దే అనిపిస్తోంది.  ‘96’ రీమేక్ కోసం థాయిలాండ్‌లో స్కై డైవింగ్ నేర్చుకుంటుండగా ల్యాండింగ్ దగ్గర తేడా వచ్చి శర్వా భుజానికి తీవ్ర గాయమైంది.

హైదరాబాద్ చేరుకున్న శర్వాకు సోమవారం నగరంలోని ఒక హాస్పిటల్లో శస్త్రచికిత్స చేశారు. భుజం సర్జరీ ఏకంగా 11 గంటలు సాగడం గమనార్హం. అతను 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు అధికారికంగానే ప్రకటించారు. ఈ దెబ్బతో ‘96’ రీమేక్ షూటింగ్ షెడ్యూళ్లన్నీ కిందా మీదా అయిపోయాయి.

గత ఏడాది తమిళంలో ఘనవిజయం సాధించిన ‘96’ సినిమాపై విడుదలకు ముందే కర్చీఫ్ వేసేశారు దిల్ రాజు. ట్రైలర్ చూసి ఫిదా అయిపోయిన ఆయన రిలీజ్ కాకముందే రీమేక్ హక్కులు కొనేశారు. అప్పట్నుంచి సన్నాహాలు చేస్తే చాలా ఆలస్యం జరిగిన నెల కిందటే సినిమా పట్టాలెక్కింది. ఇంతలోనే శర్వాకు గాయమైంది. శర్వా, సమంతలతో పాటు నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు తీసుకుని.. పక్కాగా షెడ్యూల్స్ వేసుకుని రంగంలోకి దిగితే ఇలా అయింది.

మూడు నెలల్లో సినిమాను ముగించి దసరా రేసులో నిలబెట్టాలని రాజు అనుకున్నాడు. కానీ శర్వా గాయంతో ప్లానింగ్ దెబ్బ తినేసింది. అతను కోలుకున్నాక మళ్లీ అందరి డేట్లు సర్దుబాటు చేసుకుని షూటింగ్ చేయాలి. కాబట్టి ‘96’ రీమేక్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే. సంక్రాంతికి ఆల్రెడీ గట్టి పోటీ ఉంది కాబట్టి ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ఫిక్స్ అనుకోవచ్చు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English