మోహన్ బాబును అడగట్లేదా.. చేయట్లేదా?

మోహన్ బాబును అడగట్లేదా.. చేయట్లేదా?

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా.. బహుముఖ పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. నటనలో, డైలాగ్ డెలివరీలో ఆయనకు ఆయనే సాటి. ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ’ లాంటి సినిమాల్లో మోహన్ బాబు చేసిన పాత్రల్లో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. హీరోగా కెరీర్ ముగిశాక.. ‘యమదొంగ’లో చేసిన యముడి పాత్రలో మోహన్ బాబు ఎలా చెలరేగిపోయారో తెలిసిందే. కానీ ఆయన ప్రతిభను టాలీవుడ్ ఉపయోగించుకోలేకపోతుండటమే విచారకరం.

గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు సినిమాలు బాగా తగ్గించేశారు. ఎప్పుడో ఒకసారి సొంత బేనర్లో సినిమా చేస్తున్నారు తప్పితే.. బయటి చిత్రాల్లో అస్సలు నటించడం లేదు. టాలీవుడ్ జనాలు ఆయన్ని సంప్రదించడం లేదా.. లేక అడిగినా ఆయన ఒప్పుకోవడం లేదా అన్నది అర్థం కావడం లేదు.

మోహన్ బాబు క్యారెక్టర్, విలన్ రోల్స్ చేయాలి కానీ.. ఇప్పుడు ఆ పాత్రల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న జగపతిబాబు ఆయన ముందు నిలవలేరు. ఉత్తరాది నుంచి వస్తున్న నటులు కూడా ఆయన ముందు దిగదుడుపే. మరి మోహన్ బాబు ఎందుకు తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం లేదన్నది ప్రశ్నార్థకం. ఆయనకు అస్సలు సినిమాల్లో నటించడమే ఇష్టం లేదేమో అనుకుందామంటే.. తమిళంలో మణిరత్నం, సూర్య సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో ఆయన నటిస్తున్న సంగతి ధ్రువీకరణ కూడా అయింది.

మరి కోలీవుడ్ వాళ్లు పిలుస్తుంటే వెళ్లి నటిస్తున్న మోహన్ బాబుకు తెలుగు చిత్రాల్లో నటించడంలో ఉన్న అభ్యంతరాలేంటి? వ్యక్తిగతంగా చూస్తే మోహన్ బాబుతో కొన్ని తలనొప్పులుంటాయి. ఆయనంటే మన ఫిలిం మేకర్లకు కొంచెం భయం ఉంది. ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్లుగా ఆయనతో దూరంగా ఉంటున్నారో ఏమో తెలియదు. కారణం ఏదైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప నటుడిని మిస్సయిపోతున్న మాట వాస్తవం. ఇకనైనా ఇటు మోహన్ బాబు, అటు దర్శక నిర్మాతలు బెట్టు వీడితే.. పరస్పరం సంప్రదింపులు జరిపితే తెలుగు సినిమాకు మంచి జరుగుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English