అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.  

ఈ క్ర‌మంలో పాద‌యాత్ర చివ‌రిలో శ్రీవారిని ద‌ర్శించుకుని త‌మ గోడు వెళ్ల‌బోసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్న ప్ర‌భుత్వం.. త‌మ‌కు శ్రీవారిద‌ర్శ‌న‌మైనా జ‌రి గేలా చూస్తుందా? అని ఉత్కంఠ‌తో ఎదురుచూశారు. టీటీడీ ఈవోకు.. అనేక ద‌ఫాలుగా విన్న‌వించు కున్నా రు. అయితే.. దీనిపై టీటీడీ దోబూచులాడ‌డంతో రైతులు నిరుత్సాహంలో మునిగిపోయారు. దేవ‌దేవా.. నువ్వే క‌రుణించాల‌ని… వేడుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌ధాని రైతుల‌కు తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధి నుంచి స్వాగ‌తం ల‌భించింది. శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని   స్పష్టం చేసింది.

అంతేకాదు.. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి టీటీడీ అంగీకరించింది. దీంతో ఇప్పుడు రాజ‌ధాని రైతులు ఆనంద ప‌ర‌వ‌శుల‌వుతున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవం బర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులు గా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.  

ఈ క్ర‌మంలో ఈ రోజు సాయంత్రం ముగియ‌నున్న పాద యాత్ర‌.. అనంత‌రం.. శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. ఆదినుంచి ఉత్కంఠ‌గా మారిన శ్రీవారి ద‌ర్శ‌నం పై.. టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించ‌డంతో.. రైతులు ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు. రాజ‌ధాని ర‌గ‌డ‌ను శ్రీవారు ఆల‌కించార‌ని.. వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌యం త‌మ‌కే ద‌క్కుతుంద‌ని అంటున్నారు.