ఆలూ లేదు లూ లేదు.. బంగార్రాజు సంక్రాంతికట

ఆలూ లేదు లూ లేదు.. బంగార్రాజు సంక్రాంతికట

బంగార్రాజు.. మూడేళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా ఇది. నాగార్జున కెరీర్ తిరోగమనంలో నడుస్తున్న సమయంలో ఆయనకు ఊహించని విజయాన్నందించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’కు ప్రీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీయాలన్నది దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఆలోచన. కానీ నాగ్‌ను మెప్పించడానికి కొన్నేళ్లుగా అతను చేస్తున్న ప్రయత్నాలు ఎంతకీ ఒక కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు ఈ మధ్యే స్క్ర్రిప్టుతో మెప్పించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సినిమా మొదలయ్యేవరకు గ్యారెంటీ లేదు. కానీ ‘బంగార్రాజు’ వచ్చే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని.. మరోసారి సంక్రాంతికి నాగ్ ప్రభంజనం గ్యారెంటీ అని.. ఆ పండక్కి బాలయ్యను నాగ్ ఢీకొట్టబోతుండటంతో బాక్సాఫీస్ సమరం రసవత్తరంగా ఉంటుందని ప్రచారాలు సాగిస్తున్నారు.

నాగ్ ప్రస్తుతం ‘మన్మథుడు-2’ మీదే ఫోకస్ పెట్టి ఉన్నాడు. ఆగస్టు సగం వరకు ఈ సినిమాతోనే బిజీగా ఉంటాడు. మరి ‘బంగార్రాజు’ను ఎప్పుడు మొదలుపెట్టాలి? ఆగస్టులో సినిమా పట్టాలెక్కితే.. నాలుగు నెలల్లో పూర్తి చేసి సంతృప్తికరమైన ఔట్‌పుట్‌తో సంక్రాంతికి సినిమాను రెడీ చేయడం సాధ్యమా? పైగా మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’తో పాటు అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉండగా నాగ్ తన చిత్రాన్ని పోటీలో నిలిపే సాహసం చేస్తాడా అన్నది ప్రశ్న. అన్ని కోణాల్ని విశ్లేషించి చూస్తే వచ్చే సంక్రాంతికి ‘బంగార్రాజు’ రేసులో నిలిచే అవకాశాలు దాదాపు లేనట్లే. నాగ్ స్క్రిప్టు విషయంలో ఎంత పట్టుదలతో ఉంటాడో తెలిసిందే కాబట్టి.. షూటింగ్ మొదలయ్యే వరకు ‘బంగార్రాజు’ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. కాబట్టి ముందు ఈ చిత్రం మొదలయ్యాక రిలీజ్ గురించి ఆలోచిస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English