బాలయ్య చేస్తున్నాడు.. పవన్ చేస్తే తప్పేంటి?

బాలయ్య చేస్తున్నాడు.. పవన్ చేస్తే తప్పేంటి?

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అడుగులు ఎటువైపే తెలియక అయోమయంలో ఉన్నారు ఆయన అభిమానులు. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారం ప్రకారం ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడన్నారు. ఫలితాలు పూర్తి ప్రతికూలంగా వచ్చిన నేపథ్యంలో పవన్ ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే అనుకున్నారు. కానీ పవన్ మాత్రం సినిమాల్లోకి తిరిగొచ్చే ప్రసక్తే లేదనేశాడు.

ఫలితాలు చూసి జనసేన కార్యకర్తలు, తన అభిమానులు నైరాశ్యంలోకి వెళ్లిపోవద్దన్న ఉద్దేశంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్నాడు పవన్. ఐతే చాలా అవసరమైనపుడు జనాల్లో తిరగక, మీటింగులు పెట్టకపోవడం వల్లే పవన్‌కు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఇప్పుడిక దగ్గర్లో ఎన్నికలు లేని సమయంలో, పార్టీని నడిపే వనరులు కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో పవన్ ఏమాత్రం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటాడో తెలియడం లేదు.

ఐతే ఈ పరిస్థితుల్లో పవన్ సినిమాలు చేయడమే మేలన్నది మెజారిటీ అభిప్రాయం. అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం తీసుకురావడం సినిమాలతోనే సాధ్యం. పవన్‌కు ఇప్పుడసలు ఆర్థిక పరిపుష్టి కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో సినిమాలు చేయడం అన్ని రకాలుగా మంచిదే. ఇక సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ అంతటి వాడే అప్పట్లో ముఖ్యమంత్రిగా పని చేశాక కూడా తిరిగి సినిమాలు చేశాడు.

ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్న వాళ్లు సినిమాల్లో కొనసాగుతున్నారు. నందమూరి బాలకృష్ణే అందుకు ఉదాహరణ. ఆయన సినిమాలు చేయగా లేనిది ఎమ్మెల్యే కూడా కాని పవన్ నటిస్తే తప్పేంటి? ఇదే లాజిక్‌ను తెరమీదికి తెస్తున్న పవన్ ఫ్యాన్స్.. తమ హీరో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. కానీ ఎప్పుడేం చేస్తాడో అర్థం కాని పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English