ఈ సీజన్ని ఇలా వదిలేశారేంటబ్బా..

 ఈ సీజన్ని ఇలా వదిలేశారేంటబ్బా..

టాలీవుడ్ నిర్మాతల ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్నట్లు తయారైంది పరిస్థితి. ఈ వేసవి ఆరంభంలో వరుసగా పేరున్న సినిమాలు వచ్చాయి. ఒక నెల రోజుల పాటు సందడి నడిచింది. కానీ మే 9న ‘మహర్షి’ వచ్చాక సరైన సినిమానే పడలేదు. అన్నీ చిన్నా చితకా సినిమాలే. చాలా వాటికి అసలు క్రేజే లేదు. మే లాంటి క్రేజీ నెలను ఇలా వదిలేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. జూన్ నెలలో సైతం పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకునే స్కోప్ ఉంది.
 
కానీ ప్రపంచకప్‌కు భయపడో ఏమో.. ఈ నెలలో సరైన సినిమాలే షెడ్యూల్ చేయలేదు. కానీ అక్కడ ప్రపంచకప్‌ చూస్తే అనుకున్నంత ఆసక్తికరంగా జరగట్లేదు. వర్షంతో వరుసగా మ్యాచ్‌లు రద్దవుతుండటంతో జనాలు ఖాళీగా ఉంటున్నారు. వర్షాలు పడకున్నా ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మినహాయిస్తే ఇబ్బందేమీ లేదు. అయినా ఈ సీజన్‌ను ఎందుకిలా వదిలేశారో అర్థం కావడం లేదు.

జులై నెలలో సైతం సరైన సినిమాలే లేవు. నెలాఖర్లో వచ్చే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతోనే మళ్లీ బాక్సాఫీస్‌లో వేడి పుట్టేలా కనిపిస్తోంది. ముందు వారాల్ని ఖాళీగా వదిలేస్తున్నారు. చిన్నా చితకా సినిమాలు తప్ప పేరున్నవి వచ్చేలా లేవు. జులై నెలాఖరు నుంచి విపరీతమైన పోటీ కనిపిస్తోంది. ప్రతి వారానికీ పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. విరామమే లేదు. రణరంగం, మన్మథుడు-2, సాహో, జెంటిల్‌మన్, వాల్మీకి.. ఇలా వరుసగా పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇలా విరామం లేకుండా పెద్ద సినిమాలు రావడం వాటికీ మంచిది కాదు. ప్రేక్షకులకు కూడా కొంచెం గ్యాప్ ఇవ్వాల్సింది.

ఇప్పుడు సినిమాలు లేవురా నాయనా అంటుంటే పట్టించుకునేవాళ్లు లేరు. జులై-సెప్టెంబరు మధ్య నెలన్నర కాలంలో రాబోయే సినిమాల్లో ఒక రెండు మూడు తీసి జూన్-జులై నెలల్లో షెడ్యూల్ చేసుకుని ఉంటే అందరికీ బాగుండేదన్న అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English