చిన్మయిని చిక్కుల్లో పడేసిన ‘మన్మథుడు-2’

చిన్మయిని చిక్కుల్లో పడేసిన ‘మన్మథుడు-2’

అక్కినేని నాగార్జున కెరీర్లో మరపురాని సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల కిందట వచ్చిన ఆ చిత్రం అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ట్రెండీగా ఉంటూనే క్లీన్ హ్యూమర్‌గా కుర్రకారునే కాక కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆ సినిమా మెప్పించింది. ఇప్పుడు చూసుకున్నా బోర్ కొట్టని చిత్రమది. ఇన్నేళ్ల తర్వాత ‘మన్మథుడు’కు సీక్వెల్ అనేసరికి అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడనగానే ఆ ఆసక్తి మరింత పెరిగింది. నిన్న రిలీజైన ‘మన్మథుడు-2’ టీజర్ ఎంటర్టైనింగ్‌గానే అనిపించింది కానీ.. ఈ సినిమా నడత మాత్రం ‘మన్మథుడు’ స్టయిల్లో కనిపించలేదు. ఇందులో రొమాంటిక్ టచ్ కొంచెం ఎక్కువే ఇచ్చినట్లున్నారు. డైలాగులు కూడా ఘాటుగా అనిపించాయి. ఈ బోల్డ్ నరేషన్ యూత్‌కు బాగానే నచ్చి ఉండొచ్చు కానీ.. కుటుంబ ప్రేక్షకులు మాత్రం దీన్ని మెచ్చరేమో అనిపించింది.

ఇదిలా ఉంటే టీజర్ లాంచ్ అయినప్పటి నుంచి రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయిని నెటిజన్లు టార్గెట్ చేస్తుండటం విశేషం. ‘మి టు’ మూమెంట్లో భాగంగా చిన్మయి ఏడాది నుంచి ఎలా పోరాడుతోందో తెలిసిందే. మహిళల సమస్యలు.. పురుషుల నుంచి ఎదురయ్యే వేధింపుల గురించి ఆమె గట్టిగా గళం వినిపిస్తోంది. ఐతే చిన్మయి ఎఫ్పుడూ విలువల గురించి మాట్లాడుతూ.. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు-2’ లాంటి బోల్డ్ టచ్ ఉన్న సినిమా చేయడం ఏంటని నెటిజన్లు కొందరు చిన్మయిని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఒకసారి చిన్మయి చేసిన ఓ ట్వీట్‌ను బయటికి తీసి విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు. భారతీయ చిత్రాల్లో హీరో వయసులో హీరోయిన్‌కు సగం వయసుండటం ఒక ఆనవాయితీ అయిపోయిందని, ఇది మారదా అని ఆమె 2013లో ప్రశ్నించింది. రాహుల్ డైరెక్ట్ చేస్తున్న ‘మన్మథుడు-2’లో నాగ్ వయసులో కంటే కథానాయిక రకుల్‌కు సగం కన్నా తక్కువ వయసుండటం గమనార్హం. దీన్ని ప్రస్తావిస్తూ నీ భర్త ఇలా కాస్టింగ్ చేస్తుంటే ఎలా ఊరుకున్నావని చిన్మయిని ప్రశ్నిస్తున్నారు. దీనికి చిన్మయి ఏమని బదులిస్తుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English