అసెంబ్లీ లాబీలో లోకేశ్... వైరల్ కే వైరల్

 అసెంబ్లీ లాబీలో లోకేశ్... వైరల్ కే వైరల్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ తాజా మ ాజీ మంత్రి నారా లోకేశ్... నేటి ఉదయం నిజంగానే వైరల్ కే వైరల్ అయ్యే పని చేశారు. ఇప్పటికే శాసనమండలిలో సభ్యుడిగా ఉన్న లోకేశ్... తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజధాని ప్రాంతం కావడంతో అక్కడి నుంచే అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన ఆయన కల సాకారం కాలేదు. అంతేకాకుండా టీడీపీకి ఘోర పరాభవం కూడా ఎదురైంది. ఈ క్రమంలో లోకేశ్ ఇక బయట కనిపించరన్న మాటలూ వినిపించాయి.

అయితే ఈ తరహా సెటైర్లను చాలా లైట్ తీసుకున్న లోకేశ్... నేటి ఉదయం అసెంబ్లీకి వచ్చిన తనదైన శైలిలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎమ్మెల్సీ హోదాలోనే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన ఆయన నేరుగా మండలి సమావేశాలకు వెళ్లడానికి బదులుగా అసెంబ్లీ లాబీలోకి వచ్చారు. లాబీల్లో లోకేశ్ కనిపించగానే అందరూ ఆశ్చర్యానికి గురి కాగా... వారిని మరింతగా షాక్ కు గురి చేస్తూ... వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన కరచాలనం చేశారు. అంతేనా వారిని ఆత్మీయంగా పలకరించారు.

కడప అసెంబ్లీ నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చిన లోకేశ్... అక్కడే కనిపించిన వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డిని కూడా ఆత్మీయంగా పలకరించారు. ఇక నిత్యం తనను, తన తండ్రి నారా చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కనిపిస్తే... ఆయనకు నమస్కారం పెట్టడంతో పాటు బాగున్నారా? అంటూ పలకరించిన లోకేశ్... నిజంగానే ఆసక్తి రేకెత్తించారు. మొత్తంగా నేటి ఉదయం నారా లోకేశ్ తనలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశారని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English