సల్మాన్‌తో రాజీ.. ప్రభాస్‌తో ఢీ

సల్మాన్‌తో రాజీ.. ప్రభాస్‌తో ఢీ

బాలీవుడ్లో స్వశక్తితో ఎదిగిన సూపర్ స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరో అయిన అతను.. మొదట్లో మీడియం రేంజి సినిమాలే చేసేవాడు. ఒక మూసలో సాగిపోయేవి అతడి సినిమాలు. కానీ గత దశాబ్ద కాలంలో అక్షయ్ రేంజే మారిపోయింది. ఎన్నో రకాల పాత్రలతో.. వైవిధ్యమైన సినిమాలతో తన స్థాయిని ఎంతో పెంచుకున్నాడతను. ఖాన్ త్రయానికి దీటుగా తయారయ్యాడు. అతడి సినిమా వస్తుంటే ఇప్పుడు ఖాన్స్ కూడా భయపడుతున్నారు.

షారుఖ్ ఖాన్‌ను ఇప్పుడు అక్షయ్ లెక్క చేసే పరిస్థితే లేదు. వచ్చే రంజాన్‌కు ఏకంగా సల్మాన్‌నే ఢీకొట్టాలని అతను భావించాడు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటిస్తున్న ‘సూర్యవంశీ’ సినిమాను వచ్చే ఏడాది ఈద్‌కు షెడ్యూల్ చేసి పెట్టుకున్నాడు. కానీ సల్మాన్‌తో రోహిత్‌కు ఉన్న ఫ్రెండ్షిప్ దృష్ట్యా నిన్న ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ‘ఇన్షా అల్లా’తో పోటీ లేకుండా ‘సూర్యవంశీ’ని రెండు నెలలు ముందుకు తెచ్చేశారు.

ఇది అక్షయ్ అభిమానులకు అస్సలు నచ్చట్లేదు. సల్మాన్‌తో ఇలా రాజీ కుదుర్చుకున్నందుకు రోహిత్ శెట్టిని ట్రోల్ చేస్తున్నారు. ‘షేమ్ ఆన్ యు రోహిత్ శెట్టి’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి అతడిని తిట్టి పోస్తున్నారు. ఐతే సల్మాన్‌తో పోటీ నుంచి తప్పుకున్న అక్షయ్ కుమార్.. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాడు మాత్రం సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్‌ను ఢీకొట్టడానికి ఫిక్సయిపోయాడు. ఆ రోజు ‘సాహో’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. టీజర్లో కూడా ఆ విషయాన్ని కన్ఫమ్ చేశారు.

ఐతే ‘సాహో’ కంటే ముందు ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను టార్గెట్ చేసింది అక్షయ్ సినిమా ‘మిషన్ మంగళ్’. ‘సాహో’తో పోటీ ఎందుకుని.. ఈ సినిమాను వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. ‘సాహో’పై ఎన్ని అంచనాలున్నప్పటికీ తమ సినిమాపై తమకు ధీమా ఉందన్న ఉద్దేశాన్ని చాటుతూ ఆగస్టు 15నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ధ్రువీకరించింది చిత్ర బృందం. మరి ‘సాహో’ ప్రభంజనాన్ని ఈ చిత్రం ఎలా తట్టుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English