కుర్ర డైరెక్టర్ స్పీడు మామూలుగా లేదే..

కుర్ర డైరెక్టర్ స్పీడు మామూలుగా లేదే..

‘అందాల రాక్షసి’తో మొదలుపెట్టి దాదాపు పది సినిమాల దాకా నటించాడు రాహుల్ రవీంద్రన్ తెలుగులో. తమిళంలో అతను అంతకుముందే అరంగేట్రం చేసినా.. అంతో ఇంతో పాపులారిటీ సంపాదించింది తెలుగులోనే. ఐతే నటుడిగా రాహుల్ ఒక దశ దాటాక మరీ తక్కువ స్థాయి సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని విడుదలకు కూడా నోచుకోలేదు.

నటుడిగా కెరీర్ ముగిసిపోతున్న దశలో డైరెక్షన్ అని రాహుల్ అనగానే అతడికి ఇదేం మోజు.. అవసరమా అన్న వాళ్లే ఎక్కువమంది. కానీ చడీచప్పుడు లేకుండా ‘చిలసౌ’ సినిమా తీసిన రాహుల్.. రిలీజ్ తర్వాత టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యాడు. ఆ చిత్రం కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. పరిమిత వనరుల్లో తక్కువ రోజుల్లో అంత బాగా సినిమా తీసిన రాహుల్‌ను అభినందించకుండా ఉండలేరు.

దర్శకుడిగా అనుభవమే లేని రాహుల్ నెల రోజుల్లో ఆ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. ఇప్పుడతడికి నాగార్జున లాంటి పెద్ద హీరో దొరికాడు. పెద్ద కాస్టింగ్, పెద్ద బడ్జెట్లో ‘మన్మథుడు-2’ సినిమా మొదలుపెట్టాడు. ఈసారి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాడులే అనుకుంటే.. దాన్ని కూడా మూడు నెలల్లో చుట్టి అవతల పడేస్తున్నాడు. ‘మన్మథుడు-2’ మొదలై రెండు నెలలు కూడా కాలేదు. అంతలోనే మెజారిటీ షూటింగ్ పూర్తయిపోయింది. టీజర్ కూడా వచ్చేసింది. ఇంకో రెండు నెలల్లోపే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆగస్టు 9న రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించేశారు. అంటే మూడు నెలల్లో షూటింగ్ ముగించి.. ఇంకో నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు చేసి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నాడన్నమాట రాహుల్. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి అనుకోకుండా డైరెక్షన్లోకి వచ్చిన రాహుల్ నుంచి ఇలాంటి పనితనం ఎవ్వరూ ఊహించి ఉండరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English