ఆ హీరోను చూసి మనోళ్లు నేర్చుకోవాలి

ఆ హీరోను చూసి మనోళ్లు నేర్చుకోవాలి

గత దశాబ్ద కాలంలో తమిళం నుంచి వచ్చిన బెస్ట్ యాక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా విజయ్ సేతుపతి పేరు చెప్పేయొచ్చు. ముందు నెగెటివ్, క్యారెక్టర్ రోల్స్ చేసిన అతను.. ‘పిజ్జా’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత అతను చేసిన ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని మెప్పించింది. విజయ్ సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. నటుడిగా మాత్రం అతనెప్పుడూ ఫెయిలవలేదు. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. చాలా తక్కువ సమయంలో నటుడిగా గొప్ప స్థాయిని అందుకున్నాడు. ఏ బిల్డప్ లేకుండా.. చాలా సాధారణంగా కనిపించే పాత్రల్లో కూడా తనదైన నటనతో బలమైన ముద్ర వేయడం విజయ్ ప్రత్యేకత. అతడి ప్రతిభ ఏంటో వేరే భాషల వాళ్లకూ తెలిసింది. తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’లో అతడికి కీలక పాత్ర ఇచ్చారు. దీంతో పాటు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న ‘ఉప్పెన’లోనూ ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు.


ఇందులో ఆయన చేయబోయే పాత్ర గురించి వస్తున్న సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. హీరోయిన్ తండ్రిగా మధ్య వయస్కుడి పాత్రలో విజయ్ కనిపించనున్నాడట. విజయ్‌కి వయసు మరీ ఎక్కువేమీ అయిపోలేదు. ఇంకా 40వ పడికి కూడా చేరువ కాలేదు. ఓవైపు తమిళంలో హీరో పాత్రలు చేస్తూ.. తెలుగులో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్న అతను.. తండ్రి పాత్ర ఒప్పుకోవడం విశేషమే. ఓవైపు 60 ఏళ్ల హీరోలు పడుచు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. నడి వయసు పాత్రలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. కానీ విజయ్ మాత్రం పాత్ర నచ్చాలే కానీ ఇంకేమీ చూసుకోడు. తమిళంలో ఈ మధ్యే విడుదలైన ‘సూపర్ డీలక్స్’లో అతను హిజ్రా పాత్ర చేయడం విశేషం. అతడికున్న ఇమేజ్‌కి అలాంటి పాత్రలో చూస్తే షాకవడం ఖాయం. ఈ నటుడిని చూసి మన హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English