క్లాష్ లేదు.. సూపర్ స్టార్లు కాంప్రమైజ్

క్లాష్ లేదు.. సూపర్ స్టార్లు కాంప్రమైజ్

ప్రతి ఏడాదీ రంజాన్ పండగ వచ్చిందంటే.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రిలీజ్ కావాల్సిందే. చాలా ఏళ్లుగా ఇదే ఆనవాయితీ నడుస్తోంది. అందుకే సల్మాన్‌ను ‘ఈద్ హీరో’ అంటుంటారు. ఈ ఏడాది కూడా రంజాన్‌కి ‘భారత్’ సినిమాతో పలకరించాడు సల్మాన్. ఈ పండగను సల్మాన్‌కే రాసిచ్చేసిన బాలీవుడ్ జనాలు.. అతడితో పోటీకే వెళ్లట్లేదు.

ఈ విషయంలో మిగతా హీరోలు, దర్శక నిర్మాతల్లో ఉన్న అండర్ స్టాండింగ్ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐతే ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ఈ ఆనవాయితీని బ్రేక్ చేస్తూ.. వచ్చే రంజాన్‌కు సల్మాన్‌ను అక్షయ్ కుమార్ ఢీకొట్టబోతున్నట్లు వార్తలొచ్చాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అతను నటిస్తున్న కొత్త సినిమా ‘సూర్య వంశీ’ని కూడా వచ్చే రంజాన్‌కే షెడ్యూల్ చేశారు. దీంతో సల్మాన్-అక్షయ్ మధ్య సూపర్ స్టార్ క్లాష్‌తో బాక్సాఫీస్ దగ్గర వేడి పుట్టడం ఖాయమనుకున్నారు.

కానీ ఇలా ఆశించిన వాళ్లకు నిరాశనే మిగిల్చారు ఈ సూపర్ స్టార్లు. వీళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కుదిరి.. ఒక సినిమా వెనక్కి వచ్చేసింది. అది అక్షయ్ సినిమా ‘సూర్యవంశీ’నే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయబోతున్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రకటించింది సల్మాన్ ఖాన్ కావడం విశేషం.

రోహిత్ శెట్టితో క్లోజ్‌గా ఉన్న ఒక ఫొటోను షేర్ చేసిన సల్మాన్.. అతడిని ఎప్పుడూ తన చిన్న తమ్ముడిలాగే భావిస్తున్నానని.. ఇప్పుడది మరోసారి రుజువైందని చెబుతూ ‘సూర్యవంశీ’ రిలీజ్ డేట్ ప్రకటించాడు. దీంతో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న ‘ఇన్షా అల్లా’కు లైన్ క్లియర్ అయిపోయింది. ఆ సినిమా మేలో రంజాన్ కానుకగానే విడుదల కాబోతోందని స్పష్టమైంది. మొత్తానికి ఈద్ సల్మాన్‌కే సొంతమని మరోసారి రుజువైంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English