సేమ్ టు సేమ్ పోస్టర్.. కాపీనా, యాదృచ్ఛికమా?

సేమ్ టు సేమ్ పోస్టర్.. కాపీనా, యాదృచ్ఛికమా?

‘మెంటల్ మదిలో’ లాంటి మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వివేక్ ఆత్రేయ. అతడి ద్వితీయ ప్రయత్నం ‘బ్రోచేవారెవరు’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ తాజాగా ఒక పోస్టర్ వదిలారు. సినిమాలోని కీలకమైన పాత్రలు.. సన్నివేశాల తాలూకు స్కెచ్‌లతో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది ఆ పోస్టర్. కొంతమేర గత ఏడాది వచ్చిన ‘కేరాఫ్ కంచెరపాలెం’ ఫస్ట్ లుక్ పోస్టర్ తరహాలో ఉందిది. ఐతే నిన్న ‘బ్రోచేవారెవరు’ పోస్టర్ రావడానికి ముందు రిలీజైన ఒక ప్రముఖ హాలీవుడ్ సినిమా పోస్టర్ సైతం ఇలాగే ఉండటం గమనార్హం.

వెరైటీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్వింటన్ టొరంటినో.. లియొనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్, లాంటి సూపర్ స్టార్లను పెట్టి ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు ఇప్పటికే కొన్ని ప్రివ్యూలు వేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదొక ల్యాండ్ మార్క్ ఫిలింగా నిలవడం ఖాయమంటున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన లేటెస్ట్ పోస్టర్‌కు ‘బ్రోచేవారెవరు’ పోస్టర్ కాపీ లాగా అనిపిస్తోంది. రెంటినీ పక్కన పెట్టి చూస్తే చాలా పోలికలు కనిపిస్తున్నాయి.

ఐతే వివేక్ ఆత్రేయ ఒక విభిన్నమైన దారిలో ప్రయాణిస్తున్న దర్శకుడు. అతను ఒరిజినాలిటీ కోసం ప్రయత్నిస్తాడని ‘మెంటల్ మదిలో’ చూస్తేనే అర్థమైంది. ‘బ్రోచేవారెవరు’ ప్రోమోలు కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. అలాంటి దర్శకుడు మొన్న రిలీజైన హాలీవుడ్ సినిమా పోస్టర్ చూసి.. తన సినిమా పోస్టర్ తయారు చేయించి ఉంటాడని అనుకోలేం. ఈ తరహాలో పోస్టర్లు తయారు చేయడం ముందు నుంచి ఉంది. కాబట్టి యాదృచ్ఛికంగా కూడా ఇలా జరిగి ఉండొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English