మోడీ మార్క్.. ఏడేళ్ల‌లో 73 ల‌క్ష‌ల కోట్ల అప్పు

దేశాన్ని మార్చే నాయ‌కుడంటూ వ‌రుస‌గా రెండు సార్లు మోడీకి ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అవును.. ఆయ‌న దేశాన్ని మారుస్తున్నారు కానీ అభివృద్ధి భార‌తంగా కాదు అప్పుల దేశంగా అనే విమ‌ర్శ‌లు ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధిలో దేశాన్ని ప‌రుగులు పెట్టిస్తార‌ని ఆయ‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తూ.. అప్పుల్లో దేశాన్ని ప‌రుగులెత్తిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా మండి ప‌డుతున్నారు. మోడీ సార‌థ్యంలోని బీజేపీ కేంద్ర స‌ర్కార్ దేశాన్ని ఎంత గొప్ప‌గా పాలిస్తుందో గ‌ణాంకాలే చెబుతున్నాయ‌ని ఎద్దేవా చేస్తున్నారు. మోడీ ఏడేళ్ల పాల‌న‌లో దేశం అప్పులు ఏకంగా 117 శాతం పెరిగింది. దీంతో దేశ ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందించేందుకు, పాల‌న స‌వ్యంగా సాగించేందుకు ఏ దేశ‌మైనా అప్పులు చేయ‌డం స‌హ‌జ‌మే. కానీ ఇలా భారీ మొత్తంలో అప్పులు చేస్తున్న మోడీ ప్ర‌భుత్వం దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపిస్తుందా? అంటే అదీ లేదు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సామాజిక కార్య‌క‌ర్త ఇన‌గంటి ర‌వికుమార్ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన స‌మాధానంతో ఈ అప్పుల బండారం బ‌య‌ట ప‌డింది.

1950-51లో దేశ నిక‌ర అప్పు రూ.2,565.40 కోట్లు. 2021-22 వ‌చ్చే స‌రికి అది రూ.1,35,86,975.52 కోట్ల‌కు చేరింది. 2014 నుంచి దేశాన్ని మోడీ ప్ర‌భుత్వం పాలిస్తోంది. మోడీ అధికారంలోకి వ‌చ్చేసరికి 2014-15 నాటికి దేశ నిక‌ర అప్పు రూ.62,42,220.92 కోట్లు. కానీ 2021-22 బ‌డ్జెట్ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్ల‌కు పెరిగింది. అంటే మోడీ ప్ర‌భుత్వంలో గ‌త ఏడేళ్ల‌లో కొత్త‌గా రూ.73,44,754 కోట్లు అప్పులు చేసిన‌ట్లు స్వ‌యంగా కేంద్ర స‌ర్కారు గ‌ణాంకాలే చెబుతున్నాయి. గ‌త ఏడేళ్ల‌లో దేశం అప్పు 117 శాతం పెరిగిన‌ట్లు అధికారిక లెక్క‌.

ఇప్ప‌టికే మోడీ ప్ర‌భుత్వంపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త పెరుగుతోంది. క‌రోనా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం, ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజీతో డ్రామాలు, ఇంధ‌న ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌క‌పోవ‌డం త‌దిత‌ర అంశాల వ‌ల్ల మోడీ ఇమేజ్ డ్యామేజీ అవుతోంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న ఆయ‌న‌.. మూడు రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఈ అప్పుల వ్య‌వ‌హారం ఆయ‌న‌కు త‌ల‌నొప్పి తేవ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.