కల్కి రిలీజ్ డేట్ ఇచ్చేశారు

కల్కి రిలీజ్ డేట్ ఇచ్చేశారు

సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’ రిలీజ్ విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. మే 31న రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. వాయిదా అంటే వారం రెండు వారాలు కాదని.. రెండు నెలలకు పైగా వెనక్కి వెళ్లిందని ఇటీవల వార్తలొచ్చాయి. వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వల్లే సినిమా అంత వెనక్కి వెళ్లినట్లు చెప్పుకున్నారు. దీనిపై చిత్ర బృందం సైలెంటుగా ఉండటంతో సినిమా ఆలస్యమవుతున్న మాట వాస్తవమే అనుకున్నారంతా. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ఊహాగానాలకు తెరదించేశాడు. సినిమా రిలీజ్ డేట్ చెప్పకనే చెప్పేశాడు. ఈ రోజు అతను ట్విట్టర్లో 'june 28th!!' అంటూ ఒక ట్వీట్ చేసి ఊరుకున్నాడు. అంతకుమించి ఏమీ చెప్పలేదు కానీ.. అది 'కల్కి' రిలీజ్ డేట్ అనే అంతా భావిస్తున్నారు.


కాబట్టి 'కల్కి' నెలలకు నెలలు వాయిదా పడుతున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నమాట. ఇంకో మూడు వారాల్లోపే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘పీఎస్వీ గరుడవేగ’ లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత రాజశేఖర్ నటించిన 'కల్కి' మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దీని టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చినట్లు సమాచారం. సమ్మర్లో సినిమాను రిలీజ్ చేస్తే దీనికి బాగా కలిసొచ్చేది. ఐతే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎంతో కొంత జాప్యం జరిగినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. వచ్చే రెండు వారాల్లో కూడా పెద్ద సినిమాలేవీ లేవు. కాబట్టి నెలాఖర్లో రాబోతున్న ‘కల్కి’ మీద ప్రేక్షకులు బాగానే ఆసక్తి ప్రదర్శించే అవకాశముంది. రాజశేఖర్, జీవితలతో కలిసి సి.కళ్యాణ్ నిర్మించిన ఈ థ్రిల్లర్ సినిమాలో ఆదా శర్మ కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English