‘వాల్మీకి’ని కలిసే రోజు ఫిక్సయింది

‘వాల్మీకి’ని కలిసే రోజు ఫిక్సయింది

హరీష్ శంకర్-వరుణ్ తేజ్‌ల ఆసక్తికర కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో సెన్సేషనల్ హిట్టయిన ‘జిగర్ తండ’కు ఇది రీమేక్. ఇంతకుముందు ‘దబంగ్’ సినిమాను ‘గబ్బర్ సింగ్’గా అదిరే రీతిలో రీమేక్ చేసిన హరీష్ శంకర్.. మరోసారి తనదైన శైలిలో రీమేక్ అందించాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు పెట్టిన పేరే భలే ఆసక్తి రేకెత్తించింది. తమిళంలో బాబీ సింహా చేసిన నెగెటివ్ రోల్‌ను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తుండటం విశేషం. తమిళంలో మాదిరి పూర్తి నెగెటివ్‌గా లేకుండా.. కొంచెం మార్పులు చేర్పులు చేసి.. కథ మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరిగేలా తనదైన టచ్ ఇస్తున్నాడు హరీష్. ‘దువ్వాడ జగన్నాథం’ ఫ్లాప్ అయిన.. దాదాపు రెండేళ్లు సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోయిన హరీష్‌కు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. తన కెరీర్‌కు కీలకమైన ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశాడు హరీష్.

వినాయక చవితి వీకెండ్లో.. సెప్టెంబరు 5న ‘వాల్మీకి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగింది కానీ.. షూటింగ్ వేగంగానే కానిచ్చేస్తున్నాడు హరీష్. తమిళంలో సిద్దార్థ్ చేసిన హీరో పాత్రను తెలుగులో తమిళ కథానాయకుడు అధర్వ చేస్తుండటం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా ముందు పూజా హెగ్డే పేరు వినిపించింది కానీ.. తర్వాత ఆమె ఈ సినిమాలో నటించట్లేదని అన్నారు. ఐతే హీరో, హీరోయిన్లుగా ఎవరు చేశారన్నది పెద్ద విషయం కాదు. ఈ సినిమాకు  హైలైట్‌గా నిలిచేది విలన్ పాత్రే. చిన్నా చితకా క్యారెక్టర్లు చేసే బాబీ సింహా ఆ పాత్రలో అద్భుతంగా నటించి ఏకంగా జాతీయ అవార్డే గెలిచేశాడు. అలాంటి నెగెటివ్ పాత్రలో వరుణ్ ఎలా నటించి మెప్పిస్తాడన్నది ఆసక్తికరం. ‘1 నేనొక్కడినే’.. ‘ఆగడు’.. ‘లై’ లాంటి డిజాస్టర్లతో కుదేలైన ‘14 రీల్స్’ సంస్థ ‘వాల్మీకి’ని నిర్మిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English