దర్శకుడు తేజ కష్టాలు మామూలువి కావు

దర్శకుడు తేజ కష్టాలు మామూలువి కావు

దర్శకుడు తేజ.. ఎన్నో కష్టాలు పడి సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నారని అందరికీ తెలుసు. తాను లారీ క్లీనర్‌గా కూడా పని చేసినట్లు గతంలో ఆయన చెప్పుకున్నారు. ఐతే ఆయనేమీ పేద కుటుంబంలో పుట్టలేదు. వాళ్లది ధనిక కుటుంబమేనట. కానీ పరిస్థితులు తిరగబడి తనతో తోడబుట్టిన వాళ్లందరూ దయనీయ స్థితికి చేరుకున్నట్లుగా ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన చిన్నతనం నుంచి.. దర్శకుడిగా మారే ముందు వరకు పడ్డ కష్టాల గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు. అవి తెలిస్తే కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. ఇంతకీ తేజ ఏమన్నారంటే..

"మా నాన్నది చెన్నైలో ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారం. అమ్మ కూడా వ్యాపార లావాదేవీలు చూసుకొనేది. నాతో పాటు అక్క, చెల్లి సంతానం. అమ్మానాన్న ఉన్నప్పుడు మాకు రాజభోగాలు ఉండేవి. స్కూలుకి కారులో వెళ్లేవాడిని. కానీ హఠాత్తుగా అమ్మ చనిపోయింది. దీంతో నాన్న కుంగిపోయారు. అదే సమయంలో వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆస్తులన్నీ పోయాయి. పిల్లలు ముగ్గురిని బంధువులు పంచుకున్నారు. మా చెల్లిని తీసుకెళ్లిన బంధువులు ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో వదిలేశారు. అక్క అత్త వాళ్లింట్లో కుదురుకుంది. నేను బాబాయి వాళ్లింట్లో ఉండలేక బయటికి వచ్చేశా. విజయవాడలోని హనుమాన్‌ జంక్షన్లో మా బంధువు ఒకాయన నన్ను చూసి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంటికి రమ్మన్నాడు. కానీ వెళ్తే.. మాట వరసకు పిలిస్తే వచ్చేయడమా అన్నాడు. ఇక బంధువులెవ్వరి మీదా ఆధారపడకూడదని.. నా బతుకేదో నేను బతకాలని అనుకున్నాను. బతుకుదెరువు కోసం రకరకాల పనులు చేశా. లారీ క్లీనర్‌గా వెళ్లాను. హోటల్లో పని చేశాను. చివరికి చెన్నైలో కెమెరా అసిస్టెంటుగా మారాను. ఆ సమయంలో నా దగ్గర ఒకే ప్యాంటు, రెండు చొక్కాలు ఉండేవి. వీధి కొళాయి దగ్గర స్నానం చేసి చొక్కా పిండుకొని ఆరేసుకునేవాడ్ని. ప్యాంటు రెండు మూడు రోజులకు ఒకసారి అక్కడే ఉతుక్కోవడం అలవాటు. ప్రొడక్షన్‌ వాళ్ల బండి వచ్చినపుడు ఒక పెద్ద ఇంటి దగ్గర నిలబడి ఎక్కేవాడిని. నాకు ఇల్లు లేదంటే గౌరవించరని అలా చేసేవాడిని. రాత్రిళ్లు ఫ్లాట్‌ఫాం మీదే పేపర్ కప్పుకుని పడుకునేవాడిని. షూటింగ్‌‌లో సాయంత్రం ఇడ్లీ పెట్టేవారు. రాత్రికి కూడా సరిపోయేలా తినేవాడిని. ఒక్కోసారి ప్రొడక్షన్‌ వాళ్లు కడుపునిండా తిననిచ్చేవాళ్లు కాదు. కెమెరా అసిస్టెంటుగా పని చేస్తూ కూడా రోజూవారీ ఖర్చులకు కార్లు కడిగేవాడిని. నెలంతా కడిగితే వంద రూపాయలిచ్చేవాళ్లు" అని తేజ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

చెన్నై వెళ్లినపుడల్లా తాను పని చేసిన.. రోడ్డు పక్కన నిద్రపోయిన ప్రదేశాలకు వెళ్లి నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటానని తేజ చెప్పాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English