స్కూల్ పుస్త‌కంలో సూప‌ర్ స్టార్ పాఠం

స్కూల్ పుస్త‌కంలో సూప‌ర్ స్టార్ పాఠం

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినీ ప్ర‌యాణం స్ఫూర్తి దాయ‌కం. ర‌జ‌నీ జీవితాన్ని సినిమాగా తీయ‌గ‌లిగేంత విశేషాలున్నాయి . ఒక సాధార‌ణ దిగువ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టి.. కండ‌క్ట‌ర్‌గా ప‌ని చేసిన ఆయ‌న దేశంలోనే అత్య‌ధిక పారితోష‌కం అందుకునే సూప‌ర్ స్టార్‌గా ఎద‌గ‌డం అసాధార‌ణ విష‌యం.

పెద్ద‌గా రంగు, ఫిజిక్ కూడా లేని ఆయ‌న త‌న స్వ‌స్థ‌లం కాని త‌మిళ‌నాడులో పేరు తెచ్చుకుని అంత పెద్ద హీరోగా ఎద‌గ‌డం మామూలు విష‌యం కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ల‌క్ష‌ణం ఆయ‌న గొప్ప‌ద‌నాన్ని మ‌రింత పెంచేదే. ఇంత స్ఫూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తి జీవితాన్ని పాఠ్య పుస్త‌కాల్లోకి ఎక్కించాల‌ని సూప‌ర్ స్టార్ అభిమానులు ఎప్ప‌ట్నుంచో త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వారి డిమాండ్ ఫ‌లించింది. త‌మిళ‌నాట ఐదో త‌ర‌గ‌తి పుస్త‌కంలో 'ర్యాగ్స్ టు రిచెస్' పేరుతో ఉన్న ఒక పాఠంలో ర‌జ‌నీ పోర్ష‌న్ పెట్టారు.

సాధార‌ణ నేప‌థ్యం నుంచి వ‌చ్చి గొప్ప స్థాయికి ఎదిగిన వ్య‌క్తుల క‌థ‌లున్న ఈ పాఠంలో ఛార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్, ఓప్రా విన్‌ఫ్రీ, జేకే రౌలింగ్, ఫ్రాంక్ ఒడియా లాంటి ప్ర‌పంచ ప్ర‌ముఖుల‌తో పాటు ర‌జ‌నీని కూడా చేర్చారు. వీరి జీవిత విశేషాల్ని పొందుపరిచారు. ర‌జనీకాంత్ మొదట్లో కార్పెంటర్‌గా పనిచేసేవాడ‌ని.. ఆ తర్వాత బస్ కండెక్టర్ అయ్యారని.. అక్కణ్ణుంచి నటుడిగా మారారనే విష‌యాన్ని ఇందులో వెల్ల‌డించారు.

ఈ పేజీకి సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పెట్టి సూప‌ర్ స్టార్ అభిమానులు త‌మ హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'పేట‌' సినిమాతో ప‌ల‌క‌రించిన ర‌జ‌నీ.. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌ర్బార్' సినిమా చేస్తున్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న ఆయ‌న త్వ‌ర‌లోనే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English