‘ఆర్ఎక్స్’ బుడగ పేలిపోయిందిగా..

‘ఆర్ఎక్స్’ బుడగ పేలిపోయిందిగా..

పోయినేడాది తెలుగులో సెన్సేషనల్ హిట్టయిన సినిమాల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఒకటి. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో అతి పెద్ద హిట్లలో ఇదొకటిగా నిలుస్తుంది. ఈ సినిమాతో హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడిగా మంచి పేరొచ్చింది. వాళ్లు ఇండస్ట్రీలో చాలా బిజీ అయ్యేలా కనిపించారు. కానీ ఏడాది తిరిగేసరికి చూస్తే ఈ ముగ్గురి పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. దర్శకుడు అజయ్ భూపతి కోసం హీరోలు క్యూ కట్టేస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటిదాకా అతడి కొత్త సినిమా మొదలు కాలేదు. ఇక హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు మంచి మంచి అవకాశాలు వస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. కానీ ఈ ఏడాదిలో ఆమె చేసిన సినిమాలు ‘యన్.టి.ఆర్’, ‘సీత’ మాత్రమే. రెండింట్లోనూ ఆమె పాటల్లో మాత్రమే కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకట్రెండు సినిమాలున్నాయి కానీ.. అవేమీ పెద్దవి కావు.

ఇక హీరో విషయానికి వస్తే.. కార్తికేయతో సినిమా చేయడానికి తమిళం నుంచి కలైపులి థాను లాంటి పెద్ద నిర్మాత ముందుకొచ్చాడు. కానీ ‘నువ్వు నేను ప్రేమ’ ఫేమ్ టి.ఎన్.కృష్ణ దర్శకత్వం వహించిన ‘హిప్పి’ కార్తికేయ కెరీర్‌కు పెద్ద బ్రేక్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో కార్తికేయ చాలా ఎగ్జైట్ అయ్యాడు కానీ.. ఇది ఎంతమాత్రం అతడి కెరీర్‌కు ఉపయోగపడలేదు. ‘ఆర్ఎక్స్ 100’తో కార్తికేయకు వచ్చిన క్రేజ్ మొత్తం ఈ సినిమాతో పోయింది. ఇప్పుడు అతను చేస్తున్న ‘గుణ 369’ విషయంలోనూ పెద్దగా బజ్ కనిపించడం లేదు. మరోవైపు ‘ఆర్ఎక్స్ 100’తో చాలా మంచి పేరు సంపాదించిన సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ నుంచి వచ్చిన తర్వాతి సినిమా ‘7’ సైతం నిరాశ పరిచింది. అందులో అతడి ముద్ర ఏమీ కనిపించలేదు. మొత్తానికి ‘ఆర్ఎక్స్ 100’ బుడగ ఏడాది తిరిగేలోపే ఇలా పేలిపోవడం ఆశ్చర్యకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English