కొత్త సినిమాలొచ్చాయి.. పట్టించుకోండయ్యా

కొత్త సినిమాలొచ్చాయి.. పట్టించుకోండయ్యా

టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళ తప్పింది. ‘మహర్షి’తో కొన్ని రోజులు థియేటర్లలో సందడి నెలకొంది కానీ.. ఆ తర్వాత షరా మామూలే. సరైన సినిమాలు పడక.. వచ్చినవి కూడా సరిగా ఆడక బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారే సూచనలు కూడా కనిపించడం లేదు. ఈ వారం ఒకటికి మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో ఏదీ జనాల దృష్టిని ఆకర్షించేలా లేదు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించిన కార్తికేయ.. ఆ సినిమా రిలీజైన ఏడాదిలోపే మరో సినిమాతో పలకరిస్తున్నాడు. అదే.. హిప్పి. ఇంతకుముందు సూర్య హీరోగా ‘నువ్వు నేను ప్రేమ’ తీసిన టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో ‘కబాలి’ లాంటి భారీ చిత్రాలు తీసిన కలైపులి థాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఐతే ‘ఆర్ఎక్స్ 100’ తరహాలోనే అడల్ట్, రొమాంటిక్ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. దీన్ని ఒక తెలుగు సినిమాలాగే జనాలు గుర్తించట్లేదు. ప్రమోషన్లలో ఎంత హడావుడి చేసినా ఫలితం లేకపోయింది.

దీంతో పాటుగా ‘7’ అనే థ్రిల్లర్ మూవీ కూడా రిలీజవుతోంది. ఐతే హవీష్ లాంటి ఫేస్ వాల్యూ లేని హీరో నటించడం దీనికి పెద్ద మైనస్. హీరోయిన్ల గ్లామర్ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని కొంచెం ఆకర్షిస్తోంది. ట్రైలర్ చూస్తే ఇది విభిన్నమైన సినిమాలాగే కనిపించింది. కానీ దీనికి కూడా బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. మరోవైపు ‘బిచ్చగాడు’తో వచ్చిన ఫేమ్ మొత్తం తర్వాతి సినిమాలతో పోగొట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ సినిమాతో పలకరిస్తున్నాడు. అర్జున్ ఇందులో కీలక పాత్ర చేయడం ఆకర్షణే. దీని ప్రోమోలు కూడా బాగున్నప్పటికీ విజయ్ గత సినిమాల ప్రభావం దీనిపై పడి ప్రేక్షకుల్లో ఆసక్తి కలగట్లేదు. మరి ఈ మూడు సినిమాలకు ఎలాంటి టాక్ వస్తుంది.. దాన్ని బట్టైనా ప్రేక్షకులు థియేటర్లకు కదులుతారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English