‘కల్కి’కి ఏమైందబ్బా?

‘కల్కి’కి ఏమైందబ్బా?

టాలీవుడ్ బాక్సాఫీస్‌లో స్లంప్ నడుస్తోందిప్పుడు. ‘మహర్షి’ తర్వాత పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కాలేదు. వచ్చిన చిన్న-మీడియం రేంజ్ సినిమాలేవీ ఆడలేదు. ప్రతివారం ఎంతో ఆశగా కొత్త సినిమాల వైపు చూస్తున్న ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు. ఇలాంటి టైంలో మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే.. అంచనాల్ని మించి వసూళ్లు వస్తాయి. కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సినిమానే కనిపించడం లేదు. ‘ఫలక్‌నుమాదాస్’ అనే చిన్న సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది కానీ.. ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. నిజానికి ఈ టైంలో రాజశేఖర్ సినిమా ‘కల్కి’ థియేటర్లలో ఉండాల్సింది. మే 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. చిత్ర బృందం ఈ మేరకు ముందే సంకేతాలు కూడా ఇచ్చింది. కానీ ఉన్నట్లుండి ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది.

‘కల్కి’కి ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే ఈ సీజన్లో రిలీజ్ చేసి, మంచి టాక్ తెచ్చుకుంటే పెద్ద విజయం సాధించడానికి అవకాశముంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ సినిమాకు బ్రేక్ పడిందట. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఉంది. అవి అనుకున్న స్థాయిలో రాలేదట. సినిమా ఉన్నక్వాలిటీలో ఈ వర్క్ లేకపోవడంతో అలాగే వదిలేస్తే మొత్తంగా ఔట్ పుట్ దెబ్బ తింటుందని భావించి సినిమాను వాయిదా వేయడానికి సిద్ధపడ్డాడట దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంకో రెండు నెలల తర్వాత కానీ ‘కల్కి’ విడుదల కాకపోవచ్చన్నది ఫిలిం నగర్ సమాచారం. సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్‌తో కలిసి రాజశేఖర్, జీవితలే ఈ చిత్రాన్ని నిర్మించారు. 80వ దశకంలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కింది. రాజశేఖర్ సరసన ఆదాశర్మ నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English