ధ‌నుష్‌తో సినిమాను వ‌దులుకున్న తెలుగు ద‌ర్శ‌కుడు

Dhanush

త‌మిళ ద‌ర్శ‌కులు తెలుగు హీరోల‌తో తెలుగులో సినిమాలు చేయ‌డం మామూలే. మ‌ణిర‌త్నం మొద‌లుకుని మురుగ‌దాస్ వ‌ర‌కు చాలామంది త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్లు తెలుగులో సినిమాలు చేశారు. కానీ తెలుగు ద‌ర్శ‌కులు త‌మిళంలో సినిమాలు చేసిన దాఖ‌లాలు దాదాపు క‌నిపించ‌వు. అక్క‌డి హీరోలూ ఇటు వైపు చూడ‌రు. ఇక్క‌డి ద‌ర్శ‌కులు అటు వైపు క‌న్నేయ‌రు.

ఐతే ధ‌నుష్ లాంటి పెద్ద హీరో మ‌న తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి రెడీ అయితే.. అత‌ను అంగీక‌రించ‌లేద‌ట‌. ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు.. నీదీ నాదీ ఒకే క‌థ సినిమాతో ప‌రిచ‌య‌మైన వేణు ఉడుగుల‌. అత‌డి తొలి సినిమానే త‌మిళంలో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

సీనియ‌ర్ నిర్మాత క‌లైపులి ఎస్.థాను ధ‌నుష్ హీరోగా నీదీ నాదీ ఒకే క‌థ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకున్నారు. ఐతే ఈ సినిమా విష‌యంలో ధ‌నుష్ ఓ కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఒరిజిన‌ల్ తీసిన ద‌ర్శ‌కుడైతేనే చేస్తాన‌ని అన్నాడ‌ట‌. ఈ సినిమా కోసం వేణును అడిగితే.. అత‌ను కుద‌ర‌ద‌నేశాడ‌ట‌. దీని గురించి వేణు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు.

నీదీ నాదీ ఒకే క‌థ సినిమా చేయ‌డానికి త‌న‌కు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని.. రీమేక్ కోసం మ‌ళ్లీ ఒక‌ట్రెండేళ్లు పెట్టాల‌నిపించ‌లేద‌ని.. అప్ప‌టికే విరాట ప‌ర్వం క‌థ త‌న మెద‌డులో తిరుగుతుండ‌టంతో తెలుగులోనే రెండో సినిమా చేయాల‌ని ఫిక్స‌య్యాన‌ని.. అందుకే ధ‌నుష్‌తో నీదీ నాదీ ఒకే క‌థ రీమేక్ చేయ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని చెప్పాడు వేణు.

విరాట ప‌ర్వం సినిమా కోసం ముందు త‌మిళ క‌థానాయ‌కుడు కార్తిని అనుకున్నాన‌ని.. కానీ అత‌ణ్ని సంప్ర‌దించ‌కుండా రానాను అడ‌గ‌డం.. అత‌ను వెంట‌నే ఓకే చెప్ప‌డంతో సినిమా ప‌ట్టాలెక్క‌డం జ‌రిగాయ‌ని వేణు తెలిపాడు.