బ్రేకప్ అయితే తప్ప సినిమాలు గుర్తు రాలేదా?

బ్రేకప్ అయితే తప్ప సినిమాలు గుర్తు రాలేదా?

శ్రుతి హాసన్.. తెలుగులో చాలా తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరోయిన్. తొలి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘బలుపు’, ‘రేసుగుర్రం’, ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్లతో ఒక సమయంలో ఆమె ఊపు మామూలుగా లేదు. ఐతే ఎంత వేగంగా స్టార్ అయిందో అంతే వేగంగా ఆమె ఫేడవుట్ అయిపోయింది.

మంచి ఊపులో ఉండగా సినిమాలు తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘కాటమరాయుడు’ తర్వాత ఆమె అడ్రస్ లేకుండా పోయింది. తెలుగులోనే కాదు.. వేరే భాషల్లోనూ ఆమె రెండేళ్ల పాటు సినిమాలే ఒప్పుకోలేదు. బ్రిటన్ కుర్రాడు మైకేల్‌తో ప్రేమలో పడ్డాకే ఆమె సినిమాలు తగ్గించుకోవడం గమనార్హం.

మైకేల్‌తో ప్రేమాయణంలో ఉన్నన్నాళ్లూ ఆమె ఎక్కువగా లండన్‌లో ఉంటూ మ్యూజిక్ షోలు చేసింది. శ్రుతి తీరు చూస్తే ఇక్కడి సినిమా ఆఫర్లను తనే వదులుకున్నట్లు కనిపించింది. నెమ్మదిగా దర్శక నిర్మాతలు సైతం ఆమెను ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు.  ఐతే ఈ మధ్యే అతడి నుంచి విడిపోయిన శ్రుతి.. ఉన్నట్లుండి మళ్లీ సినిమాలు ఒప్పుకుంటోంది.

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. అప్పుడే మైకేల్‌తో శ్రుతి విడిపోయిన సంగతి వెల్లడైంది. ఇప్పుడు తెలుగులో శ్రుతి రెండు సినిమాలు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించబోయే చిత్రంతో పాటు గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్లో రాబోయే కొత్త సినిమాలోనూ శ్రుతినే కథానాయికగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి లవ్ బ్రేకప్ అయితే తప్ప శ్రుతికి సినిమాలు గుర్తుకు రాలేదా అని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English