జగన్ హిట్లర్ అవ్వకూడదు: వైసీపీ ఎంపీ

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్దం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆ పార్టీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్ వంటి నియంతలలాగా దుర్మార్గుడిగా చరిత్రలో నిలిచిపోతారేమోనన్నదే తన బాధ అని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. చరిత్రలో విలన్లకు చెడుగా గుర్తింపు, హీరోలకు మంచి గుర్తింపు ఉంటుందని, రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు…జగన్..ఇలా అందరూ తమ తమ చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, జగన్ పాలనను ప్రశ్నించినప్పటి నుంచి తనపై కక్షగట్టారని ఆరోపించారు. స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వద్దని చెప్పినప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించొద్దని చెబితే తనపై అనర్హత వేటు కోసం స్పీకర్ ను కలిశారని అన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను రఘురామ ఖండించారు. జేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని, ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి అన్నారని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కోసం రైతులు భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని మండిపడ్డారు.

అమరావతి కోసం రైతులు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమానికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపు సైన్యంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లకు జీతమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆరోపించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.