రేవంత్ ని హర్ట్ చేసిన ఢిల్లీ కాంగ్రెస్

ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో దారుణ ఫ‌లితంతో ఢీలా ప‌డ్డ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం ఢిల్లీలో అధిష్ఠానం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఇక్క‌డ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే.. అటు ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రుల‌తో క‌లిసి కాంగ్రెస్ స‌మావేశం నిర్వ‌హించ‌డం రాష్ట్ర నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీనిపై జాతీయ నేత‌లు దృష్టి సారించాల‌ని రాష్ట్ర పార్టీ నాయ‌కులు కోరుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

బీజేపీపై ఫోక‌స్‌..

ఇప్ప‌టికే తెలంగాణ‌లో కేసీఆర్ త‌న‌కు ప్రధాన ప్ర‌త్య‌ర్థిగా బీజేపీని భావిస్తున్నారు. ఆ పార్టీ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకునే ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్ నాయ‌కులు ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత ఇక్క‌డ కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారింది.

కానీ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కంతో తిరిగి రాష్ట్రంలో పార్టీ దూకుడు కొన‌సాగిస్తోంది. రేవంత్ పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ సాగుతున్నారు. కానీ ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో అధిష్ఠానం వైఖ‌రి ఇప్పుడు రాష్ట్ర నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఆ స‌మావేశంతో..

పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అధికార బీజేపీపై విప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఆ ఆందోళ‌న‌లో టీఆర్ఎస్ కూడా జ‌త‌క‌లిసింది. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల నేత‌లు క‌లిసి స‌మావేశంలో పాల్గొన్నాయి. దీన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయ‌కులు హైలైట్ చేశారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్ ఒక‌టేన‌ని తెలంగాణ‌లో ఆ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌ని చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఇబ్బందిగా మారింది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేత‌ల ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టే నిర‌స‌న‌లు,స‌మావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్ర స్థాయిలో త‌మ‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కు కూడా చెప్పార‌ని తెలిసింది. అయితే బీజేపీ వ్య‌తిరేకంగా వ‌చ్చే పార్టీల‌ను జాతీయ స్థాయిలో క‌లుపుకుని పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు బ‌దులిచ్చిన‌ట్లు స‌మాచారం.