బాలయ్య కోసం రాసిన కథ.. మహేశ్ దగ్గరకు చేరిందట

బాలయ్య కోసం రాసిన కథ.. మహేశ్ దగ్గరకు చేరిందట

‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’ వంటి వరుస విజయాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు, మహేశ్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

 ఈ సినిమా కథను మహేశ్‌కు చెప్పడానికి ముందే నందమూరి బాలకృష్ణకు వినిపించాడట అనిల్ రావిపూడి. గతంలో బాలయ్య వందవ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిన సమయంలో ఆయనకు ‘‘రామారావు గారు’’ అనే టైటిల్‌తో ఓ కథను వినిపించాడని ప్రచారం జరిగింది. అప్పుడు ఆ కథ బాలయ్యకు నచ్చినా.. ఎందుకో ఆ సినిమాను పక్కన పెట్టేశాడని అంతా అనుకున్నారు. అప్పుడే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేసి ప్రతిష్టాత్మక చిత్రాన్ని హిట్ కొట్టాడు ఈ నందమూరి హీరో. ఆ తర్వాత కూడా ఆయన.. అనిల్ రావిపూడితో సినిమా చేసే ప్రయత్నం చేయలేదు. కానీ, ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మాత్రం సినిమాలు చేసి సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్‌తో ఛాన్స్ కొట్టేశాడు.

 బాలకృష్ణకు స్టోరీ చెప్పిన తర్వాత అనిల్ రావిపూడి ఆ స్క్రిప్టును ఎవరికీ వినిపించలేదు. కానీ, దానికే కొన్ని మార్పులు చేసి సూపర్ స్టార్ మహేశ్‌కు చెప్పాడట. అదే ‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీ అని తెలుస్తోంది. అప్పుడు బాలయ్యకు చెప్పిన ‘‘రామారావు గారు’’ కథలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్ర పోషించాల్సి ఉండగా, ఇందులో మాత్రం మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. అనిల్ ఈ సినిమా చేస్తుండగా, బాలయ్య మాత్రం కేఎస్ రవికుమార్, బోయపాటి శ్రీనుతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ, ఈ రెండు సినిమాలు పట్టాలెక్కే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ అయితే, బాలయ్య మంచి అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English