బయోపిక్ అంటే ఇలా తీయాలి

బయోపిక్ అంటే ఇలా తీయాలి

బయోపిక్ అంటేనే భయపడిపోయేలా చేసింది ‘యన్.టి.ఆర్’ సినిమా. ఉన్నంతలో క్రిష్ బాగానే తీసినా ఈ సినిమా ఆ స్థాయిలో పరాజయం చవిచూడటం ఆశ్చర్యకరం. దీనికి కారణాలేంటని విశ్లేషిస్తూ పోతే చివరగా తేలిందేంటంటే.. ఎన్టీఆర్ జీవితాన్ని పూర్తి పాజిటివ్‌గా.. లెక్కకు మిక్కిలి ఎలివేషన్లతో చూపించడం సినిమా కొంప ముంచింది.
ఎన్టీఆర్ జీవితంలోని ఎత్తుపల్లాల్ని ఇందులో ఎక్కడా చూపించలేదు. ఆయన చరమాంకంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల్ని ఇందులో మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. ‘మహానటి’ ఆడిందంటే.. సావిత్రి జీవితంలోని ఎత్తుపల్లాల్ని వాస్తవికంగా చూపించారు. డ్రామా పండింది. ‘యన్.టి.ఆర్’లో ఆ డ్రామానే మిస్సయింది. ‘యన్.టి.ఆర్’ సినిమా విషయంలో మేకర్స్ నిజాయితీ చూపించలేదన్నది పెద్ద విమర్శగా మారింది. ఐతే ఇప్పుడు తెలుగులో తెరకెక్కిన మరో బయోపిక్ మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది.

చేనేత కార్మికుల కోసం ప్రత్యేకమైన యంత్రాన్ని కనిపెట్టి వారి కష్టాల్ని తగ్గించడం ద్వారా జాతీయ స్థాయిలో పేరు సంపాదించి, పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్న చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ ట్రైలర్ తాజాగా రిలీజైంది. రెండున్నర నిమిషాల ఆ ట్రైలర్ చూస్తే.. తెలుగులో తెరకెక్కిన ఒక అరుదైన, స్వచ్ఛమైన సినిమాలా కనిపించింది. మల్లేశం జీవితాన్ని ఎగ్జాజరేట్ చేయకుండా చాలా వాస్తవికంగా చూపించారని, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల్ని ఉన్నదున్నట్లుగా చూపించడమే సినిమాకు ప్రధాన ఆకర్షణగా కనిపించింది. దర్శకుడు రాజ్ కొత్తవాడైనా.. మంచి అభిరుచి ఉన్నవాడని అర్థమవుతోంది.

మల్లేశం జీవితాన్ని సొమ్ముచేసుకోవడం కాకుండా నిజాయితీగా చేసిన ఒక ప్రయత్నం లాగే ఉంది ‘మల్లేశం’ సినిమా. ట్రైలర్ చూస్తే మాత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’ తరహాలో తెలుగువాళ్లు గర్వంగా చెప్పుకునే సినిమాగా ‘మల్లేశం’ నిలుస్తుందని, బయోపిక్ ఎలా తీయాలో ఇదొక ఉదాహరణగా చెప్పుకునేలా ఉంటుందని అనిపిస్తోంది. మరి సినిమాగా ‘మల్లేశం’ ఎలా ఉంటుందో చూడాలి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English