‘యన్.టి.ఆర్’ సినిమా చూడలేదు.. చూడను-తేజ

‘యన్.టి.ఆర్’  సినిమా చూడలేదు.. చూడను-తేజ

నందమూరి తారక రామారావు బయోపిక్ కోసం తేజ లాంటి దర్శకుడిని ఎంచుకోవడం ఆశ్చర్యం. ఆ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యాక దాన్నుంచి తేజ తప్పుకోవడం మరో సంచలనం. కథాకథనాల విషయంలో బాలయ్యకు, తేజకు తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని.. అందుకే తేజ బయటికి వచ్చాడని ఊహాగానాలు వినిపించాయి. ఐతే బాలయ్య అలాంటిదేమీ లేదన్నాడు. తేజనే తనకు తానుగా సినిమా నుంచి బయటికి వెళ్లిపోయినట్లు చెప్పాడు.

ఈ మధ్య తేజ సైతం దీనిపై స్పందించాడు. బాలయ్య మాటనే ధ్రువీకరించాడు. తాను ‘యన్.టి.ఆర్’ సినిమాకు న్యాయం చేయలేనన్న ఉద్దేశంతోనే తప్పుకున్నట్లు తెలిపాడు. ఐతే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమా దారుణమైన ఫలితాన్నందుకోవడంతో తేజ తప్పుకుని మంచి పని చేశాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అలాగే తేజ తీసి ఉంటే ‘యన్.టి.ఆర్’ సినిమా ఇలా వచ్చేది కాదని కూడా చాలామంది అన్నారు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర రీతిలో స్పందించాడు తేజ. ఈ అభిప్రాయాలు చాలానే తాను విన్నానని.. ఈ రకంగా తనకు సినిమా తీయకపోవడం వల్ల చాలా పేరొచ్చేసిందని.. కానీ తాను తీస్తే ‘యన్.టి.ఆర్’ సినిమా ఇంకా చండాలంగా తయారయ్యేదేమో అని తేజ వ్యాఖ్యానించడం విశేషం. ఇంతకీ క్రిష్ తీసిన ‘యన్.టి.ఆర్’ సినిమా చూశారా అని అడిగితే.. చూడలేదని, ఎప్పటికీ చూడబోనని కూడా తేజ చెప్పాడు.

దీనికి కారణం వివరిస్తూ.. తాను చాలా ఓపెన్‌గా మాట్లాడతానని, ఏదీ మనసులో దాచుకోనని.. ఒకవేళ ‘యన్.టి.ఆర్’ సినిమా చూసి.. దాని మీద మీడియా వాళ్లో ఇంకొకరో స్పందించమని అడిగి.. తాను ఏదో ఒకటి అని లేని పోని వివాదం రాజుకుంటుందని.. తన కెరీర్లో ఇలాంటి వివాదాలు చాలా ఉన్నాయని.. కాబట్టే ఎందుకొచ్చిన గొడవ అని తాను ఆ సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నానని తేజ చెప్పాడు. గతంతో పోలిస్తే మీలో దూకుడు తగ్గినట్లుందే, వివాదాలకు దూరంగా ఉంటున్నారే అంటే అలాంటిదేమీ లేదేని.. పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదన్న సామెత ప్రకారం తన బుద్ధి ఎప్పటికీ మారదని.. కాకపోతే ఈ మధ్య కొంచెం నటించడం నేర్చుకుని కవర్ చేస్తున్నానని తేజ పేర్కొనడం విశేషం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English