టీ కాంగ్రెస్‌ గ‌ప్‌చుప్‌… ఆ ఎన్నిక వ‌దిలేశారా?

స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ వ‌దిలేసిందా..? పార్టీ బ‌ల‌మున్న చోట కూడా కాడి కింద ప‌డేసిందా..?  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ఇవే అనుమానాలు క‌లుగుతున్నాయి. పార్టీకి పెద్ద పెద్ద లీడ‌ర్ల‌మ‌ని.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను తామే శాసిస్తున్నామ‌ని చెప్పుకునే న‌ల్ల‌గొండ నేత‌లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ను కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం పార్టీ దుస్థితికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

కాంగ్రెస్ కంచుకోట‌కు బీట‌లు వారుతున్నాయా..?
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట నిన్న‌టి వ‌ర‌కు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మెల్ల‌గా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డి గెలింపించుకోలేక‌పోవ‌డం.., నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పార్టీ దిగ్గ‌జం జానారెడ్డి ఓడిపోవ‌డం.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ఎన్నిక‌లో పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ కాంగ్రెస్ డౌన్‌ఫాల్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపిస్తున్నాయి.

గ్రూపు త‌గాదాలు స‌రేస‌రి..!
తెలంగాణ కాంగ్రెస్‌లో వ‌ర్గ విభేదాలు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ముఖ్య‌మంత్రిగా, పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న వారికి ఇత‌ర వ‌ర్గాలు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. ఎవ‌రికి వారు గ్రూపులు ఏర్పాటు చేసుకోవ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది. న‌ల్ల‌గొండ జిల్లాలోనైతే ఇదీ మ‌రీ ఎక్కువ‌గా ఉంది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఒక వ‌ర్గం.. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మ‌రొక వ‌ర్గం.. జానారెడ్డిది ఒక బ్యాచ్‌.. మాజీ మంత్రి దామోద‌ర్‌రెడ్డికి ఇంకొక బ్యాచ్‌. ఇలా ఒక జిల్లాలోనే నాలుగైదు గ్రూపులుగా త‌యారైంది కాంగ్రెస్ పార్టీ. అదీ కాకుండా ఇటీవ‌ల పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి మ‌రో వ‌ర్గాన్ని త‌యారుచేసుకున్నాడు. వీళ్ల‌లో ఒక‌రంటే మ‌రొక‌రికి ప‌డ‌దు. ఒక‌రి ఎదుగుద‌ల‌ను ఇంకొక‌రు స‌హించ‌రు. పైకి మాత్రం డాబు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. వీరి వ్య‌వ‌హారంతో పార్టీ శ్రేణులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.

మ‌ద్ద‌తు ఎవ‌రికి..?
ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులు 200 పైనే ఉన్నారు. వీరంద‌రినీ ఏకం చేసి అభ్య‌ర్థిని బ‌రిలో నిల‌బెడితే టీఆర్ఎస్‌కు దీటుగా బ‌దులిచ్చిన‌ట్లు ఉండేది. కానీ పార్టీ ఆ ప‌ని చేయ‌లేదు. పెద్ద‌లు సైలెంట్‌గా ఉండ‌డంతో ఇద్ద‌రు ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత జ‌డ్పీటీసీ స‌భ్యుడు కుడుదుల న‌గేశ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. అలాగే.. న‌ల్ల‌గొండ జ‌డ్పీటీసీ వంగూరి ల‌క్ష్మయ్య కూడా బ‌రిలో నిలిచారు. వీరిలో న‌గేశ్ రేవంత్ వ‌ర్గంగా.., ల‌క్ష్మ‌య్య కోమ‌టిరెడ్డి వ‌ర్గంగా గుర్తింపు పొందారు.

వీరిద్ద‌రూ ఎవ‌రికి వారు ప్ర‌చారం చేసుకుంటున్నా పార్టీ ఆస‌క్తి చూప‌డం లేదు. పార్టీ పెద్ద‌లు ఇప్పుడు ఏం చేయ‌బోతున్నార‌నే అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఎవ‌రికో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయం కార్యక‌ర్త‌ల్లో ఉంది. చివ‌రికైనా ఓట్లు చీలిపోకుండా ఎవ‌రికో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇస్తారా..? లేదంటే పార్టీ ఓట్లు చీలి ఇత‌ర పార్టీల వైపు వెళ్లి ప‌రువు తీసుకుంటుందా..? అనే భ‌యం శ్రేణుల‌ను వెంటాడుతోంది. కాంగ్రెస్ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తుందో వేచి చూడాలి