శంకర్‌‌తో సంతకం పెట్టించుకుని మరీ..

శంకర్‌‌తో సంతకం పెట్టించుకుని మరీ..

దర్శకుడు శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. పాటలకు కూడా కోట్లు ఖర్చు పెట్టించేయడం శంకరే ఇండియన్ సినిమాకు అలవాటు చేశాడు. ఐతే ఒకప్పుడు శంకర్ ఎంత ఖర్చు పెట్టించినా అది సినిమాకు అవసరమే అనిపించేది. ప్రతి రూపాయీ తెరపై కనిపించేది. కానీ ఈ మధ్య వ్యవహారం తిరగబడుతోంది. ‘ఐ’ సినిమాకు అవసరం లేకపోయినా అయినకాడికి ఖర్చు పెట్టి ఆ నిర్మాతను ముంచేశాడు. ఆ తర్వాత ‘2.0’ సంగతీ తెలిసిందే. రూ.545 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిన సినిమా ఎంతమాత్రం కాదది.

అందులో మూడో వంతు ఖర్చుతో ఒకప్పుడు ‘రోబో’ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ‘2.0’ సినిమా తీసిన లైకా ప్రొడక్షన్స్ సంస్థకు వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ.. మరో సంస్థ అయితే నిండా మునిగిపోయేదే. అయినా వాళ్లు శంకర్‌తో ఇంకో సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషమే. దిల్ రాజు భయపడి వదిలేసిన ‘భారతీయుడు-2’ చిత్రాన్ని ఆ సంస్థే టేకప్ చేసింది.

కానీ ప్రి ప్రొడక్షన్ దశలో, తొలి షెడ్యూల్లో శంకర్ చుక్కలు చూపించేశాడు. బడ్జెట్ హద్దులు దాటబోతోందని లైకా వాళ్లకు అర్థమైపోయింది. దీంతో శంకర్‌తో కయ్యం మొదలైంది. సినిమాకు బ్రేక్ పడింది. మధ్యలో కమల్ హాసన్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల కూడా సినిమా ముందుకు కదల్లేదు. ఐతే త్వరలోనే మళ్లీ షూటింగ్ కొనసాగించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఈసారి శంకర్‌తో ఒక అగ్రిమెంట్ చేయించుకుని మరీ కొత్త షెడ్యూల్ మొదలుపెడుతున్నారట నిర్మాతలు.

ముందు తమకు చెప్పిన బడ్జెట్లోనే సినిమా పూర్తి చేసేట్లు ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టాడట శంకర్. బడ్జెట్ పెరిగితే శంకర్ నుంచి వసూలు చేస్తారనేమీ కాదు కానీ.. ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కాబట్టి శంకర్ కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నది నిర్మాతల ఆలోచన కావచ్చు. మరి శంకర్ ఏమాత్రం హద్దుల్లో ఉండి సినిమా తీస్తాడో చూడాలి. కెరీర్లో ఇప్పటిదాకా శంకర్‌కు అనుభవంలో లేని విషయమిది. ఈ పరిస్థితి ఆయన చేజేతులా తెచ్చుకున్నదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English