నేనే రాజు నేనే మంత్రి.. ఒక యాక్సిడెంట్ అంతే

నేనే రాజు నేనే మంత్రి.. ఒక యాక్సిడెంట్ అంతే

ఒక దర్శకుడు 15 ఏళ్ల పాటు హిట్టు ముఖం చూడకుండా ఇండస్ట్రీలో కొనసాగడం అంటే మాటలు కాదు. అలాగని ఆ దర్శకుడు సినిమాలు తీయకుండా ఉంటున్నాడా.. సినిమాకు, సినిమాకు విరామం చాలా విరామం తీసుకుంటున్నాడా అంటే అదీ లేదు. ఈ దశాబ్దంన్నరలో డజనుకు పైనే సినిమాలు తీశాడు. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్కటీ హిట్టవ్వలేదు. అయినా ఆశ కోల్పోలేదు. ఒక పేరున్న నటుడిని, పెద్ద నిర్మాతను మెప్పించి సినిమా తీశాడు. ఆ సినిమా అనుకోకుండా సూపర్ హిట్ అయింది. ఈ ఉపోద్ఘాతమంతా సెన్సేషనల్ డైరెక్టర్ తేజ గురించే.

‘జయం’ తర్వాత దశాబ్దంన్నర పాటు హిట్టుకు నోచుకోని ఆయన రెండేళ్ల కిందట ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఐతే అది చూస్తుంటే.. ఇది తేజ సినిమానేనా అన్న సందేహం కలిగింది. తేజ గత సినిమాలకు, దానికి పోలికే కనిపించలేదు. ఏదైతేనేం తేజ మారాడు మంచిదే అనుకున్నారు.

కానీ ఈ మార్పు ఒక్క సినిమాకే పరిమితం అయిపోయింది. ‘సీత’తో మళ్లీ పూర్వపు ఫామ్ అందుకున్నాడు తేజ. గత శుక్రవారం రిలీజైన ‘సీత’ తేజ అభిమానుల్ని మళ్లీ నిరాశకు గురి చేసింది. ‘నేనే రాజు నేనే మంత్రి’లో ఉన్న బిగి, ఇంటెన్సిటీ ఇందులో ఎంతమాత్రం కనిపించలేదు. రొటీన్ కథకథనాలతో విసుగెత్తించేశాడు తేజ. ‘నేనే రాజు నేనే మంత్రి’ అనుకోకుండా హిట్ అయిపోయింది తప్ప.. తేజలో గొప్ప మార్పేమీ రాలేదని.. ఆయన ఔట్ డేట్ అయిపోయాడని ‘సీత’ రుజువు చేసింది.

కొత్త నటీనటులతో కూడా చాలా మంచి నటన రాబట్టుకుంటాడని పేరున్న తేజ.. ‘సీత’లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్‌ను ఎలా భరించాడో అర్థం కాలేదు. సినిమాకు అతను పెద్ద మైనస్ అయిపోయాడు. అసలు అతడిని ఆ పాత్రకు ఎంచుకోవడమే పెద్ద రాంగ్ స్టెప్. ఆ స్థానంలో మరొకరు ఉంటే సినిమా కొంచెం బెటర్‌గా అనిపించేదేమో. ఏదేమైనప్పటికీ ‘నేనే రాజు నేనే మంత్రి’తో వచ్చిన పేరును వెంటనే పోగొట్టుకుని తేజ పూర్వపు స్థితికి చేరుకోవడం ఆయన అభిమానులకు నిరాశ కలిగించేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English