కాంఛన రీమేక్.. లారెన్స్ స్థానంలో అతను

కాంఛన రీమేక్.. లారెన్స్ స్థానంలో అతను

సౌత్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంఛన’ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ నుంచి దర్శకుడు రాఘవ లారెన్స్ ఇటీవల తప్పుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిర్మాతలు తనకు తెలియకుండా ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడంతో హర్టయి సినిమా నుంచి వైదొలిగాడు లారెన్స్. తాను ఇంత బాధతో సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినా కూడా నిర్మాతల నుంచి స్పందన లేకపోవడం లారెన్స్‌ను మరింత బాధ పెట్టింది. అతడి మాటల్ని బట్టి చూస్తే లారెన్స్‌ను నిర్మాతలు బుజ్జగించే ప్రయత్నం ఏదీ చేయలేదని స్పష్టమవుతోంది. లారెన్స్ తప్పుకోవడాన్ని ప్రొడక్షన్ హర్టయినట్లేమీ కనిపించడం లేదు. ఇందుకు బాగానే ప్రిపేర్ అయ్యారనే అనిపిస్తోంది. లారెన్స్ వైదొలిగిన వారం రోజుల్లోనే అతడి రీప్లేస్మెంట్ రెడీ అయిపోవడం విశేషం.

‘లక్ష్మీబాంబ్’ కోసం రచయితగా పని చేస్తున్న ఫర్హద్ సంజికి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు. ఫర్హద్.. సాజిద్ అనే మరో రచయితతో కలిసి ఎన్నో చిత్రాలకు రచన అందించాడు. వీళ్లిద్దరూ కలిసి ‘హౌస్ ఫుల్’ సిరీస్‌లో రెండు చిత్రాలకు డైరెక్షన్ కూడా చేశారు. కామెడీ రాయడంలో, తీయడంలో సిద్ధహస్తులుగా వీరికి పేరుంది. ‘కాంఛన’ రీమేక్ కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు, దర్శకుడిగా అనుభవం కూడా ఉంది కాబట్టి పెద్దగా కంగారు పడకుండా నిర్మాణ సంస్థ ఫర్హద్‌కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించేసింది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే లారెన్స్‌ను పొమ్మనకుండా పొగబెట్టేశారేమో అని కూడా అనిపిస్తోంది. ఓవైపు లారెన్స్ అక్షయ్ కుమార్ తప్పేమీ లేదంటూ అతడిని పొగిడేస్తున్నాడు కానీ.. అతడి మౌనం చూస్తుంటే లారెన్స్ వైదొలగడంలో అతడి పాత్రా ఉందేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English