ఒక సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులా?

ఒక సినిమాకు ఆరుగురు సంగీత దర్శకులా?

ఒక సినిమాకు ఒకరికి మించి సంగీత దర్శకులు పని చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఒకరు పాటలు ఇస్తే ఇంకొకరు నేపథ్య సంగీతం అందించడం చాలాసార్లు చూశాం. కొన్ని సినిమాలకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పాటలు ఇవ్వడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘లవర్’ సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పాటలు ఇచ్చారు. కానీ అది చిన్న సినిమా. దానికి పని చేసిన సంగీత దర్శకులు కూడా అంత ఫేమస్ ఏమీ కాదు. కానీ తమిళంలో ఒక పెద్ద సినిమాకు ఆరుగురు ప్రముఖ సంగీత దర్శకులు మ్యూజిక్ అందిస్తున్నారు. కేవలం మ్యూజిక్ విషయంలోనే కాదు.. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ విభాగాల్ని కూడా ఆరేసిమంది పంచుకుంటుండటం విశేషం. అంతే కాదు.. ఈ చిత్రంలో ఆరు పోర్షన్లు ఉండగా ఆరుగురు దర్శకులు వాటికి స్క్రీన్ ప్లే సమకూరుస్తుండటం విశేషం.

ఆ సినిమా పేరు.. కసాడా తబార. వడివేలు సినిమా ‘23వ పులకేసి’తో దర్శకుడిగా పరిచయం అయిన శంకర్ శిష్యుడు చింబుదేవన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విజయ్ హీరోగా ‘పులి’ అనే భారీ సినిమా తీసి దారుణంగా దెబ్బ తిన్న చింబుదేవన్.. ఆ తర్వాత మళ్లీ ‘కసాడా తబార’తో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం. దీనికి యువన్ శంకర్ రాజా, సంతోష్ నారాయణన్, జిబ్రాన్, సీన్ రోల్డాన్, ప్రేమ్ జీ అమరన్, శామ్ సీఎస్.. ఈ ఆరుగురు ప్రముఖ సంగీత దర్శకులు సంగీతం సమకూర్చబోతుండటం విశేషం.

దీనికి పని చేసే ఆరుగురు ఎడిటర్లు, ఆరుగురు కెమెరామన్‌లు కూడా ప్రముఖులే. బాలీవుడ్లో పార్ట్‌లు పార్ట్‌లుగా సాగే సినిమాలకు ఎక్కువమంది దర్శకులు కలిసి స్క్రీన్ ప్లే సమకూర్చడం, డైరెక్షన్ చేయడం చూశాం. కానీ ఇలా ఆరుగురు దర్శకులు స్క్రీన్ ప్లే రాస్తే.. ఆరుగురు సంగీత దర్శకులు, ఆరుగురు కెమెరామన్లు, ఆరుగురు ఎడిటర్లు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం అరుదు. ఇండియన్ సినిమాలో ఇదొక వినూత్న ప్రయోగం అనొచ్చు. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English