కారుకు ఇది దిమ్మదిరిగే షాకే

కారుకు ఇది దిమ్మదిరిగే షాకే

ఉన్న స్థానాల్లో మూడింట రెండు వంతుల స్థానాలు సాధిస్తే ఏ పార్టీ అయినా సంతోషించాలి. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నం. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఎంఐఎం పక్కాగా గెలిచే హైదరాబాద్ స్థానాన్ని విడిచిపెడితే.. మిగతా పదహారు స్థానాలకు పదహారూ తామే సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ భావించింది. కారు-పదహారు అంటూ ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన భారీ విజయం ప్రకారం చూస్తే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీ క్లీన్ స్వీప్ సాధించాలి. కానీ ఎన్నికల ఫలితాల ప్రాథమిక ట్రెండ్స్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉదయం పదిన్నర ప్రాంతంలో పదహారులో 11 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మిగతా ఐదు స్థానాల్లో నాలుగింట్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉండటం షాకింగ్. ఒక స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెపై భాజపా అభ్యర్థి అర్వింద్ 18 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్‌లో అగ్ర నేత కిషన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కరీం నగర్లో సైతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్.. టీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

మల్కాజ్‌గిరిలో ఒక దశ వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగాడు కానీ.. తర్వాత ఆయన వెనుకబడ్డాడు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న నాలుగు స్థానాల్లోనూ భాజపా గెలిస్తే.. మున్ముందు ఆ పార్టీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English