ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్

ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్

ఒక ఇండియన్ సినిమా మొత్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధిస్తే.. ఇప్పటికీ గొప్పగానే చెప్పుకుంటున్నాం. అలాంటిది ఒక ప్రాంతీయ సినిమా అమెరికాలో రూ.130 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు సాధించడం అనూహ్యమైన విషయం. 'బాహుబలి: ది కంక్లూజన్' ఆ ఘనత సాధించింది. యుఎస్‌లో మన సినిమాలకు ఏ స్థాయిలో మార్కెట్ ఉందో రుజువు చేసింది ఆ సినిమా.

అన్ని సినిమాలూ 'బాహుబలి' రేంజికి వెళ్లలేవు కానీ.. మన సినిమాలకు అక్కడ ఉన్న మార్కెట్ తక్కువేమీ కాదు. ఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజవ్వడమే గొప్పగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో మన సినిమాలకు అక్కడ ఏ రేంజిలో మార్కెట్ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. మిలియన్ డాలర్ క్లబ్ అనేది మన చిత్రాలకు కేక్ వాక్ అయిపోయింది ఒక దశలో. 'ఫిదా'; 'అర్జున్ రెడ్డి' లాంటి చిన్న సినిమాలు  సైతం 2 మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టడాన్ని బట్టి అక్కడ మన చిత్రాలకు ఎంతటి ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు.

కానీ తెలుగు సినిమాలకు బంగారు బాతులా కనిపించినా ఓవర్సీస్ మార్కెట్‌ను మన వాళ్లే దెబ్బ తీసుకున్నారు. అత్యాశకు పోయి ఈ బాతును కబళించేయాలని చూడటంతో వచ్చింది సమస్య. క్వాలిటీ మీద దృష్టిపెట్టకుండా అనవసర హడావుడి చేయడం, ప్రిమియర్లతో భారీ వసూళ్లను టార్గెట్ చేసి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం ప్రతికూలంగా మారింది. అదే సమయంలో అమేజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌ మన సినిమాల ఓవర్సీస్ వసూళ్లపై బాగానే ప్రభావం చూపించాయి. ఇంతకుముందులా వేలం వెర్రిగా టికెట్లు కొని సినిమాలు చూసేయట్లేదు అక్కడి ప్రేక్షకులు.

గతంలో ఎంత రేటు పెట్టినా చూడకుండా కొనుక్కుని వెళ్లిపోయేవాళ్లు. అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగేవి. కానీ ఇప్పుడు సినిమా టాక్ తెలుసుకుని కానీ కదలట్లేదు. టికెట్ల రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక రోజంతా వెచ్చిస్తే కానీ సినిమా చూడలేరు. ఈ పరిస్థితుల్లో సినిమా టాక్ ఏంటో తెలుసుకోకుండా వెళ్లి.. అది బాగా లేదంటే నిట్టూర్చడం ఎందుకని టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా బాగుంది అన్న టాక్ వస్తే తప్ప సినిమాలకు వెళ్లట్లేదు.

ఈ ఏడాది ఇప్పటికే ఐదు నెలలు గడుస్తున్నాయి. ఓవర్సీస్‌లో బయ్యర్లకు పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చి 'బ్లాక్ బస్టర్' అనిపించుకున్న సినిమా ఒక్కటి మాత్రమే ఉండటం గమనార్హం. అదే.. ఎఫ్-2. ఈ స్థాయిలో విజయం సాధించిన సినిమా ఇంకొక్కటి కూడా లేదు. ఇది కాకుండా 'జెర్సీ' ఒక్కటి కొద్దిగా లాభాలు తెచ్చింది. 'మజిలీ', '118', 'లక్ష్మీస్ ఎన్టీఆర్' బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లే. 'వినయ విధేయ రామ', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' లాంటి భారీ చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి.

'మహర్షి' విషయంలో తెగ హడావుడి చేస్తున్నారు కానీ.. ఓవర్సీస్‌లో అది కూడా డిజాస్టరే. బ్రేక్ ఈవెన్ రావాలంటే మూడున్నర మిలియన్లు వసూలు చేయాల్సిన ఈ చిత్రం ఇంకా 2 మిలియన్ మార్కు కోసం కష్టపడుతోంది. ఈ ఐదు నెలల్లో వచ్చిన మిగతా చిత్రాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ జూదం లాగా మారినట్లు కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English