అలాంటి సినిమాకు ఇలాంటి దర్శకుడా?

 అలాంటి సినిమాకు ఇలాంటి దర్శకుడా?

తమిళంలో ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాల్లో 'తడమ్' ఒకటి. అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్టు మగిల్ తిరుమణి డైరెక్ట్ చేశాడు. కవలలైన హీరోలు ఒక మర్డర్ కేసులో చిక్కుకుని.. దాన్నుంచి ఎలా బయటపడ్డారనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రానికి అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా పెద్ద విజయమే సాధించిందీ చిత్రం.

'తడమ్' రిలీజైన కొన్ని రోజులకే తెలుగు రీమేక్ హక్కులు అమ్ముడైపోయాయి. స్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ హక్కులు తీసుకున్నారు. రామ్‌తో ఈ చిత్రం తీద్దామని ఆయన అనుకుంటున్నారు. రెండు నెలలుగా దర్శకుడి వేటలో ఉన్నారాయన. చివరికి కిషోర్ తిరుమలను ఫైనలైజ్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

'సెకండ్ హ్యాండ్' అనే ఓ చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కిషోర్‌తో 'నేను శైలజ' సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు రవికిషోర్. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత కిషోర్ 'చిత్రలహరి' సినిమా తీశాడు. దర్శకుడిగా మొదట్నుంచి సెన్సిబుల్, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలే తీశాడు కిషోర్. అతడి శైలి ప్రకారం చూస్తే 'తడమ్' లాంటి థ్రిల్లర్ మూవీని డీల్ చేయగలడని అనిపించదు.

అసలు 'తడమ్' రీమేక్‌కు రామ్ కూడా సెట్టవుతాడా లేదా అన్నది డౌటే. ఏ అడివి శేష్ లాంటి వాడో అయితే బాగుంటుందేమో. 'క్షణం', 'గూఢచారి' లాంటి సినిమాల్ని డీల్ చేసిన డైరెక్టర్లు అయితే బాగా సెట్టవుతారు అనిపిస్తుంది. ఐతే ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నపుడు ముందే ఓ అంచనాకు రావడం కూడా కరెక్ట్ కాదేమో. రామ్, కిషోర్‌ల్లో ఇంతవరకు చూడని యాంగిల్స్ 'తడమ్' రీమేక్‌తో చూపిస్తారేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English