సినిమా బాలేకుంటే నన్ను బూతులు తిట్టండి

సినిమా బాలేకుంటే నన్ను బూతులు తిట్టండి

మాటలకు ముసుగేయకుండా చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటాడు దర్శకుడు తేజ. కాకపోతే ఆయన మాటల్లో చాలా యారొగెన్స్ కనిపిస్తుంటుంది. వాళ్లను వీళ్లనూ విమర్శించి వివాదాల్లో చిక్కుకుంటుంటారు. ఐతే ఈ మధ్య ఆయన తీరు మారింది. అనవసరంగా ఎవరినీ టార్గెట్ చేయట్లేదు. ఎవరినీ నొప్పించేలా మాట్లాడట్లేదు. అలాగని ఓపెన్‌గా మాట్లాడే తన శైలిని ఆయన విడిచిపెట్టలేదు. తాజాగా 'సీత' ప్రి రిలీజ్ ఈవెంట్లో తేజ స్పీచ్ విన్న ఎవరైనా సరే.. ఫిదా కాకుండా ఉండలేరు. తన మీద తనే సెటైర్లు వేసుకుంటూ ఆద్యంతం జనాల్ని అలరించాడు తేజ.

'సీత' సినిమా బాగా లేకుంటే తనను బూతులు తిట్టమని తేజ ప్రేక్షకులకు పిలుపునివ్వడం విశేషం. సినిమా 90 శాతం బాగా తీశానని.. పది శాతం సినిమాలో కొన్ని తప్పులు కనిపించాయని.. వాటిని సరిదిద్ది సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చానని తేజ చెప్పాడు. సినిమా కచ్చితంగా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నానని.. కానీ సినిమాలో ఏమైనా తప్పులుంటే నిర్మొహమాటంగా చెప్పాలని.. తద్వారా తన తర్వాతి సినిమా విషయంలో పొరబాట్లు దొర్లకుండా చూసుకుంటానని తేజ చెప్పాడు.

'సీత' సినిమాకు సంబంధించి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ చాలా బాగా చేశారని.. కానీ దర్శకుడిగా తాను మాత్రమే యావరేజ్‌గా పని చేశానేమో అనిపిస్తోందని తేజ చెప్పడం విశేషం. ఇక తన కళ్ల జోడు అదీ చూసి అందరూ మేధావి అనుకుంటుంటారని.. అలాంటిదేమీ లేదని.. కళ్లజోడు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ మేధావి కాదని తేజ తనదైన శైలిలో మరో కామెంట్ చేశాడు.

ఇంతకుముందు తాను తీసిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను మూడు భాషల్లో తీయాలని అనుకుంటున్నట్లు ప్రకటించగానే.. ఫ్లాప్ డైరెక్టర్ సినిమా మూడు భాషల్లోనా అంటూ మీడియా వాళ్లు వార్తలు రాశారని.. తనపై పడ్డ ఆ సెటైర్లను దృష్టిలో ఉంచుకుని తన లాంటి ఒక పాత్రను 'సీత' సినిమాలో పెట్టేశానని తేజ చెప్పాడు. ఇలాగే తనను తిట్టినా, పొగిడినా కూడా సినిమాలో పెట్టేస్తానని అన్నాడు.

సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నపుడు ఎప్పుడూ లైటింగ్ గురించి ఆలోచించేవాడినన్న తేజ తన మనసెప్పుడూ ఇలాగే సినిమా చుట్టూనే తిరుగుతుంటుందని.. తనకు సినిమా తప్ప ఏమీ  రాదు, చేతకాదని తేల్చి చెప్పేశాడు తేజ. చివరగా ప్రేక్షకులు బాగుండాలి అంటూ చాలా నిజాయితీగా ఒక మాట చెప్పి తన ప్రసంగాన్ని ముగించాడు తేజ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English