బిచ్చ‌గాడు హీరో.. ఇంత కాలానికి మారాడు

బిచ్చ‌గాడు హీరో.. ఇంత కాలానికి మారాడు

*బిచ్చ‌గాడు* సినిమాతో విజ‌య్ ఆంటోనీ అనే న‌టుడి పేరు తెలుగులో మార్మోగిపోయింది. సంగీత ద‌ర్శ‌కుడిగా ప్ర‌స్థానం మొద‌లుపెట్టి అనుకోకుండా హీరో అయిన అత‌ను మొద‌ట్లో వైవిధ్య‌మైన సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు. *బిచ్చ‌గాడు* త‌మిళంలో మాదిరే తెలుగులోనూ అద్భుత విజ‌యాన్నందుకుని అత‌డికి మంచి ఫాలోయింగ్, మార్కెట్ తెచ్చిపెట్టింది. కానీ ఈ సినిమాతో వ‌చ్చిన పేరును వాడేసుకుందామ‌ని చూసిన విజ‌య్ చేదు అనుభ‌వాలు ఎదుర్కొన్నాడు. ముందు వెనుక చూడ‌కుండా ఎలా ప‌డితే అలా సినిమాలు చేసేయ‌డంతో క్వాలిటీ ప‌డిపోయింది. ఎంత వేగంగా రైజ్ అయ్యాడో అంతే వేగంగా ప‌డిపోయింది. త‌మిళంలో సైతం అత‌డి మీద ప్రేక్ష‌కుల‌కు న‌మ్మ‌కం పోయింది. చివ‌ర‌గా అత‌డి నుంచి వ‌చ్చిన సినిమాల పేర్లు కూడా గుర్తులేవు జ‌నాల‌కు.

ఐతే పూర్తిగా మార్కెట్ దెబ్బ తిన్నాక విజ‌య్ కాస్త అప్ర‌మ‌త్తం అయిన‌ట్లున్నాడు. అత‌డి కొత్త సినిమా కొలైగార‌న్ (తెలుగులో కిల్ల‌ర్)లో విష‌యం ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. దీని టీజ‌ర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజ‌య్ ఒక సైకో త‌ర‌హా పాత్ర చేస్తున్నాడు. అత‌ను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అది వ‌న్ సైడ్ ల‌వ్. కానీ ఆమె కూడా అత‌డిని ప్రేమించిన‌ట్లు ఊహించుకుని ఏదేదో చేస్తుంటాడు. ఆ అమ్మాయితో పాటు మ‌రికొంద‌రిని అత‌ను హ‌త్య చేసిన‌ట్లు చూపిస్తారు. ఒక ఇమేజినేష‌న్లో ఉండి అనూహ్య‌మైన ప‌నులు చేసే ఈ హీరో గుట్టు ఏంటో బ‌య‌ట‌పెట్ట‌డానికి పోలీస్ ఆఫీస‌ర్ అయిన అర్జున్ రంగంలోకి దిగుతాడు. ఈ మిస్ట‌రీని అత‌నెలా ఛేదించాడు.. ఇంత‌కీ హీరో ఉద్దేశ‌మేంటి అన్న‌ది క‌థ‌. అర్జున్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటేనే ఇందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉండాలి. టీజ‌ర్ చూస్తే ఆస‌క్తిక‌ర మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ లాగా అనిపిస్తోంది. మ‌రి సినిమాగా ఇది ఏమేర‌కు మెప్పిస్తుందో చూడాలి. ఆషిమా న‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి ఆండ్రూ లూయిస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్వ‌ర‌లోనే త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English