అమెజాన్ దెబ్బ మమూలుగా లేదుగా!

అమెజాన్ దెబ్బ మమూలుగా లేదుగా!

అమెజాన్ ప్రైమ్లో కాస్త లేటుగా సినిమాను రిలీజ్ చేస్తే.. 'జనాలు ధియేటర్ కు రావట్లేదు' అనే అంశం సాల్వ్ అయిపోయి, అందరూ ధియేటర్లకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అని భావించారు టాలీవుడ్ పెద్దలు. అయితే ఇక్కడ పరిస్థితి మరో రకంగా ఉందని వారు గమనిస్తున్నారో లేదో కాని, ఇప్పుడు మరో యాంగిల్లో తమకు దెబ్బ తగలడంతో ఆడియన్స్ కూడా రూటు మార్చారు.

నిజానికి ఒక సినిమా టిక్కెట్ ధర రూ.150 నుండి 200 ఉంది. ఇంకొన్ని చోట్ల అయితే స్టాండర్డ్ గా ధియేటర్ అంతా వంద రూపాయల టిక్కెట్ పెట్టేశారు. అయితే కేవలం 20 వేలు నెలజీతంతో బ్రతికే ఒక ఫ్యామిలీకి 500-800 రూపాయలు సినిమా టిక్కెట్లు ప్లస్ పార్కింగుకు పెట్టాలంటే.. కాస్త ఇబ్బందే. ఎందుకంటే ఆ డబ్బుతో వాళ్ళు ఒక నెల కరెంట్ బిల్ కట్టుకోవచ్చు. ఇక తినుబండారులు కూడా కొంటే పర్సు కరిగిపోతుందంతే. అందుకే ఆ డబ్బులు వాళ్ళు ఇంటర్నెట్ కనక్షన్ కు పెట్టేసి, అమెజాన్ ప్రైమ్ కొనుక్కొని.. అందులో సినిమాలు చూసేస్తున్నారు.

సమ్మర్లో మజిలీ సినిమా హిట్టయింది, చిత్రలహరి బాగానే ఉంది అనుకునేలోపే.. ఆ సినిమాలు ప్రైమ్ లో వచ్చేశాయి. ఇప్పుడు చక్కగా తమ ఇంట్లో కూలర్ పెట్టుకుని నిమ్మరసం తాగుతూ చక్కగా మనోళ్ళు ఈ సమ్మర్ బొనాంజాలను ఆస్వాదిస్తున్నారు. మహర్షి అంటే పెద్ద సినిమా కాబట్టి జనాలు వస్తున్నారు.. ఇదే టైములో వచ్చిన ఇతర సినిమాల గురించి పబ్లిక్ లో టాక్ ఏంటంటే.. ఓ నాలుగు వారాలు ఆగితే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తుందిగా అంటూ ధియేటర్లకు రావడం మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ఆ మధ్యన మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన లూసిఫర్ సినిమాకు తెలుగులో అస్సలు ధియేటర్లే దొరకలేదు. కాసినన్ని ధియేటర్లలో రిలీజైనా జనాలు చూడలేదు కాని, ఇప్పుడు ప్రైమ్ లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చీకటి గదిలో చితక్కొట్టుడు వంటి ఎడల్ట్ కామెడీకి కూడా ప్రైమ్ లో ఆడియన్స్ ఎక్కువగానే ఉన్నారట. చూస్తుంటే మన సినిమా ప్రొడ్యూసర్లు గతంలో టివిలకు ఎలాగైతే సంవత్సరం వరకు సినిమా టెలికాస్ట్ చేయకూడదని రూల్స్ పెట్టారో ఇప్పుడు అమెజాన్ విషయంలో కూడా అలాగే చేయాలేమో.

కాని అలా చేస్తే, అమెజాన్ అంతంత డబ్బులు ఇచ్చి సినిమాలు ఎందుకు కొంటుంది? అన్నేసి కోట్లు పెట్టి సినిమాలు కొంటున్న అమెజాన్, సినిమాను వెంటనే రిలీజ్ చేయడానికి సుముఖత చూపుతుంది. కాబట్టి మనోళ్ళు అయితే సినిమాలను చాలా బాగా తియ్యాలి, లేదంటే, అమెజాన్ కు అమ్మకూడదు. కాదంటే మాత్రం, రెండు వారాల్లో వచ్చిందే కలక్షన్, తరువాత మొత్తం ఖాళీయే.
   

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English