భారతీయుడు-2 ఉందంటున్న ఆమె

భారతీయుడు-2  ఉందంటున్న ఆమె

ఎన్నో ఏళ్లుగా చర్చల్లో ఉన్న ‘భారతీయుడు-2’ ఎట్టకేలకు గత ఏడాది చివర్లో పట్టాలెక్కిందని చాలా సంతోషించారు కమల్ హాసన్, శంకర్ అభిమానులు. ఐతే ఈ కలల ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. కొన్ని రోజులు షూటింగ్ చేశాక ఈ సినిమాను ఆపేశాడు శంకర్. బడ్జెట్ సమస్యలని, కమల్‌తో విభేదాలని రకరకాల వార్తలొచ్చాయి. మళ్లీ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సంకేతాలు వచ్చాయి కానీ.. తర్వాత ఏ అప్ డేట్ లేదు.

కమల్ రాజకీయాలపైకి దృష్టిమళ్లించాడు. శంకర్ ఏమో తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా గుసగుసలు వినిపించాయి. ఇక ‘భారతీయుడు-2’ ముందుకు కదలకపోవచ్చనే అంచనాకు వచ్చేశారు అభిమానులు. ఐతే ఈ సినిమాపై ఎన్నో ఆశలతో ఉన్న కాజల్ అగర్వాల్ మాత్రం ‘భారతీయుడు-2’పై నెలకొన్న సందేహాల్ని కొట్టిపారేసింది.

‘భారతీయుడు-2’ జూన్లోనే మళ్లీ పట్టాలెక్కబోతోందని ఆమె ప్రకటించింది. ఈ సినిమాకు బడ్జెట్, ఇతర సమస్యలని వస్తున్న వార్తల్ని ఆమె కొట్టిపారేసింది. కమల్ హాసన్ రాజకీయాల కోసం కొంత బ్రేక్ తీసుకోవడం వల్లే ఈ చిత్రం తాత్కాలికంగా ఆగినట్లు కాజల్ స్పష్టం చేసింది. ఆయన ఫ్రీ అవ్వగానే షూటింగ్ కొనసాగించనున్నట్లు చెప్పింది. కాజల్ కెరీర్లో ఇదే అతి పెద్ద ఛాన్స్ అని చెప్పొచ్చు. దక్షిణాదిన ప్రతి కథానాయికా రజనీకాంత్, కమల్ హాసన్‌లో నటించాలనుకుంటుంది. శంకర్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయాలని ఆశపడుతుంది.

కాజల్‌కు ఒకేసారి కమల్-శంకర్‌లతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కెరీర్ చరమాంకంలో ఇంత పెద్ద ఛాన్స్ వస్తుందని కాజల్ ఊహించి ఉండదు. ఈ ప్రాజెక్టు పట్ల ఆమె చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇప్పటిదాకా జరిగిన షూటింగ్‌లో కాజల్ భాగం కాదు. ఆమె పాత్ర తాలూకు చిత్రీకరణ ఆరంభం కాబోతుండగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. మరి కాజల్ చెప్పినట్లే జూన్‌లో ‘భారతీయుడు-2’ మళ్లీ పట్టాలెక్కుతుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English